Mercedes-Benz: మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి రెండు 7-సీటర్‌ ఎస్‌యూవీలు

విలాసవంత కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ మరో రెండు కొత్త ఎస్‌యూవీలను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. జీఎల్‌బీ, ఈక్యూబీ పేరుతో వస్తున్న ఈ కార్లు రెండూ 7-సీటర్‌ సామర్థ్యంతో వస్తున్నాయి.

Published : 02 Dec 2022 22:30 IST

దిల్లీ: విలాసవంత కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా జీఎల్‌బీ, ఈక్యూబీ అనే రెండు కొత్త 7-సీటర్‌ ఎస్‌యూవీలను శుక్రవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. జీఎల్‌బీలో 200, 220డీ, 220డీ 4మేటిక్‌ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.63.8 లక్షలు, రూ.66.8 లక్షలు, రూ.69.8 లక్షలు (ఎక్స్‌షోరూం). పూర్తిగా విద్యుత్తు వాహనమైన ఈక్యూటీ 300 4మేటిక్‌ ధర రూ.74.5 లక్షలు (ఎక్స్‌షోరూం).

సరికొత్త హంగులతో ఈ రెండు ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు మెర్సిసెస్‌-బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ తెలిపారు. మధ్యస్థాయి కుటుంబాలకు ఇది సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా రెండు సీట్లను ఇస్తున్నట్లు తెలిపారు. కంపెనీ తొలిసారి పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ ఇలా మూడు పవర్‌ట్రెయిన్‌లలో ఒకేసారి కార్లను అందిస్తోంది. 

జీఎల్‌బీ తెలుపు, నలుపు, నీలం, గ్రే, ఎరుపు రంగుల్లో వస్తోంది. ఈక్యూబీని తెలుపు, నలుపు, గ్రే, సిల్వర్‌, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందిస్తున్నారు. ఈక్యూబీని ఇక్కడే పుణెలోని ప్లాంటులో తయారు చేయనుండగా.. జీఎస్‌బీని మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. జీఎల్‌బీ 200 వేరియంట్‌ 163 హెచ్‌పీ శక్తిని, 250ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈక్యూబీలో 69.7కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 420 కి.మీ ప్రయాణిస్తుంది. 220 హెచ్‌పీ శక్తిని, 390 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 30 అల్ట్రాఫాస్ట్‌ ఛార్జర్లను ఏర్పాటు చేశామని.. ఈ ఏడాది చివరకు మరో 10 అమర్చుతామని మెర్సిడెస్‌-బెంజ్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని