Ola Electric IPO: ఓలా ఐపీఓ ప్లాన్‌.. గిగా ఫ్యాక్టరీకి రూ.1200 కోట్లు

Ola Electric IPO: ఓలా తన ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని గిగా ఫ్యాక్టరీ విస్తరణకు వినియోగించనుంది. ఆర్‌అండ్‌డీ, రుణాల తిరిగి చెల్లింపులకు ఉపయోగించుకోనుంది.

Published : 26 Dec 2023 19:09 IST

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ద్వారా రూ.5,500 కోట్లు సమీకరించేందుకు ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి ఇటీవల దరఖాస్తు చేసుకుంది. ఐపీఓ ద్వారా సమకూరే నిధుల్లో రూ.1225.43 కోట్లను సెల్‌ తయారీ యూనిట్‌ విస్తరణకు వినియోగించనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తన పత్రాల్లో పేర్కొంది. రూ.1600 కోట్లు పరిశోధన, అభివృద్ధికి; రూ.800 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది.

సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. తమిళనాడులోని కృష్ణగిరిలో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు, విస్తరణ ప్రక్రియను ఓలా రెండు దశల్లో చేపట్టనుంది. అంతర్గత నిధి, రుణాల ద్వారా సమీకరించిన మొత్తంలో ఫేజ్‌ 1 (ఏ) దశ పూర్తి చేయనుంది. 2024 నాటికి 1.4 GWh కెపాసిటీతో సెల్‌ తయారీ చేపట్టనుంది. ఫేజ్‌ 1(బి)ని 2024 అక్టోబర్‌ నాటికి పూర్తి చేయనుంది. సామర్థ్యాన్ని 5 GWh వినియోగించనుంది. ఫేజ్‌ 2 ప్రక్రియలో భాగంగా 2025 ఏప్రిల్‌ నాటికి కెపాసిటీని 6.4 GWh, 2026 రెండో త్రైమాసికానికి 20GWh పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణకు ఐపీఓ నిధులను వినియోగించనుంది. 

ఇక ప్రొడక్ట్స్‌ లాంచ్‌ గురించీ కొన్ని వివరాలను ఓలా ఎలక్ట్రిక్‌ తన పత్రాల్లో పేర్కొంది. ఓలా ఎస్‌1 సిరీస్‌లో అందుబాటు ధరలో మరిన్ని ఉత్పత్తులు తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది. 2023 ఆగస్టులో క్రూజర్‌, అడ్వెంచర్‌, రోడ్‌స్టర్‌, డైమండ్‌ హెడ్‌ పేరుతో ప్రకటించిన మోటార్‌సైకిళ్ల డెలివరీని 2026 తొలి భాగంలో చేపట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. మాస్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మోటార్‌ సైకిల్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని