ChatGPT: చాట్‌జీపీటీ ఇక వింటుందీ చూస్తుంది.. కొత్త ఫీచర్లు వారికి మాత్రమే!

ChatGPT: చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా చాట్‌బాట్‌ కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్లు ఓపెన్‌ ఏఐ సంస్థ తన బ్లాగ్‌లో తెలిపింది.

Published : 27 Sep 2023 02:04 IST

ChatGPT | ఇంటర్నెట్‌డెస్క్‌: కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఓపెన్‌ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ (ChatGPT) ఇప్పటికే బాగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా కొన్ని కొత్త ఫీచర్లను ఓపెన్‌ ఏఐ (OpenAI) ప్రకటించింది. ఇకపై చాట్‌జీపీటీతో సంభాషించడంతో పాటు ఇమేజ్‌ రూపంలో కమాండ్స్‌ ఇచ్చే సేవల్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఓపెన్‌ ఏఐ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది.

ప్రస్తుతం చాట్‌జీపీటీలో కేవలం టెక్ట్స్‌, వాయిస్‌ రూపంలో ప్రశ్నలడిగేందుకు అవకాశం ఉంది. అలా అడిగే ప్రశ్నలకు చాట్‌జీపీటీ టెక్స్ట్‌ రూపంలో సమాధానం ఇస్తోంది. ఇలా సమాధానం చెప్పే సమయంలో మనం కల్పించుకొని మరో ప్రశ్నను అడగటానికి వీలుండదు. కానీ, చాట్‌జీపీటీ తీసుకొస్తున్న వాయిస్‌ ఫీచర్‌తో ఈ సదుపాయాన్ని జోడించనుంది. వాయిస్‌ రూపంలో ఏదైనా అడిగినప్పుడు వాయిస్‌ రూపంలోనే చాట్‌జీపీటీ సమాధానం చెప్తుంది. మధ్యలో మనం కల్పించుకోవచ్చు కూడా. దానికీ చాట్‌జీపీటీ ఆన్సర్‌ ఇస్తుంది.

మస్క్‌ను మలిచిన మూడు పుస్తకాలు.. బయోగ్రఫీలో వెల్లడించిన ప్రపంచ కుబేరుడు

ఫొటోకూ సమాధానం

కొన్ని ప్రశ్నలు అడగాలంటే సవివరంగా రాయాల్సి ఉంటుంది. అదే మన దగ్గర సంబంధిత ఇమేజ్‌ ఉంటే ఇదీ సమస్య అంటూ సులువుగా ప్రశ్న వేయొచ్చు. చాట్‌జీపీటీలో ఇప్పుడు ఇదే ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఓపెన్‌ ఏఐ తెలిపింది. మీకు కావాల్సిన ఫొటోను అప్‌లోడ్‌ చేసి ప్రశ్న అడగ్గానే వివరంగా చాట్‌జీపీటీ సమాధానం చెబుతుంది. ఉదాహరణకు సైకిల్‌ సీటు తగ్గించడానికి ఏం చేయాలనేది ఫొటో అప్‌లోడ్‌ చేసి అడిగితే.. నేరుగా వ్యక్తే వచ్చి సమాధానం ఇస్తున్నట్లుగా మనల్ని గైడ్‌ చేస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ రెండు సదుపాయాలను రానున్న రెండు వారాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని ఓపెన్‌ ఏఐ తెలిపింది. అయితే, చాట్‌జీపీటీ ప్లస్‌, ఎంటర్‌ప్రైజ్‌ యూజర్లకు మాత్రమే వీటిని వినియోగించే వీలుంటుందని పేర్కొంది. వాయిస్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, ఐఫోన్లలో, ఇమేజ్‌ ఫీచర్‌ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓపెన్‌ ఏఐ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని