Reliance: టీవీ రంగంలో రూ.4,286 కోట్ల ఒప్పందం.. రిలయన్స్‌ చేతికి పారామౌంట్‌ వాటా

Reliance: ఇప్పటికే వాల్ట్‌ డిస్నీతో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు ప్రకటించిన రిలయన్స్‌ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వయాకామ్‌18లో పారామౌంట్‌ గ్లోబల్‌కున్న 13 శాతం వాటాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది.

Published : 14 Mar 2024 13:14 IST

దిల్లీ: భారత టీవీ వ్యాపారంలో తమకున్న వాటాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) విక్రయించనున్నట్లు అమెరికాకు చెందిన పారామౌంట్‌ గ్లోబల్‌ (Paramount Global) గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ‘నిశ్చయాత్మక ఒప్పందం’ కుదిరినట్లు వెల్లడించింది. దీనికి నియంత్రణా సంస్థల అనుమతులు లభించాల్సి ఉన్నట్లు తెలిపింది. అలాగే కొన్ని షరతులు కూడా విధించుకున్నట్లు.. వాటికి ఇరు సంస్థలు కట్టుబడితేనే ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది.

వయాకామ్‌ 18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పారామౌంట్‌ గ్లోబల్‌కున్న 13.1 శాతం వాటాలను రూ.4,286 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. మరోవైపు రిలయన్స్‌, వయాకామ్‌ 18, స్టార్‌ డిస్నీ మధ్య ఏర్పాటు చేయదలచిన జాయింట్‌ వెంచర్‌ పూర్తయిన తర్వాతే తాజా కొనుగోలు ఒప్పందం అమల్లోకి వస్తుందని యూఎస్‌ ఎక్స్ఛేంజీలకు పారామౌంట్ (Paramount Global) తెలియజేసింది. కొనుగోలు ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పారామౌంట్ తమ కంటెంట్‌ను వయాకామ్‌18కు అందిస్తుందని వెల్లడించింది. ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయితే వయాకామ్‌లో రిలయన్స్‌ వాటా 70.49 శాతానికి పెరుగుతుంది. రిలయన్స్‌ షేరు గురువారం 0.50 శాతానికి పైగా పెరిగి రూ.2,881 వద్ద ట్రేడవుతోంది.

ఇప్పటికే భారత్‌లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అమెరికాకు చెందిన వాల్ట్‌ డిస్నీ కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే. పలు భాషల్లో 120 టీవీ ఛానళ్లు (కలర్స్‌, స్టార్‌ ప్లస్‌, స్టార్‌ గోల్డ్‌ లాంటి వినోద ఛానళ్లు; స్టార్‌ స్పోర్ట్స్‌, స్పోర్ట్‌ 18 లాంటి క్రీడా ఛానళ్లు), రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు (జియో సినిమా, హాట్‌స్టార్‌), దేశవ్యాప్తంగా 75 కోట్ల మంది వీక్షకుల సంఖ్యతో భారత మీడియా, వినోద రంగంలో అతిపెద్ద సంస్థగా ఇది నిలుస్తుంది. ‘ఒప్పందంలో భాగంగా స్టార్‌ ఇండియాలో వయాకామ్‌ 18 మీడియా వ్యాపారం విలీనం అవుతుంద’ని ఇరుసంస్థలు తెలిపాయి. విలీనానంతరం సంస్థ విలువ రూ.70,352 కోట్లుగా (8.5 బిలియన్‌ డాలర్లు) ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే సోనీ, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి సంస్థలతో పోటీపడేందుకు విలీనానంతర సంస్థలో రూ.11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రిలయన్స్‌ అంగీకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని