రిలయన్స్‌ రిటైల్‌లో QIA పెట్టుబడి.. ఒక్క శాతం వాటాకు ₹8,278 కోట్లు

QIA to invest in Reliance Retail: రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌లో ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ₹8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Updated : 23 Aug 2023 21:08 IST

ముంబయి: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (RRVL)లో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (Qatar Investment Authority) పెట్టుబడికి ముందుకొచ్చింది. ఒక్క శాతం వాటాకు గానూ రూ.8,278 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ ప్రీ మనీ ఈక్విటీ వాల్యూ రూ.8.278 లక్షల కోట్లుగా గణించి క్యూఐఏ పెట్టుబడికి 0.99 శాతం ఈక్విటీ వాటా కేటాయించనున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

రిలయన్స్‌ రిటైల్‌లో క్యూఐఏ ఇన్వెస్ట్‌మెంట్‌పై సంస్థ డైరెక్టర్‌ ఇషా అంబానీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలను, రిలయన్స్‌ వ్యాపార నమూనా, వ్యూహాల అమలుపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. క్యూఐఏ అంతర్జాతీయ అనుభవం, వాల్యూక్రియేషన్‌లో ఉన్న ట్రాక్‌ రికార్డును తమకు ఉపయోగపడనుందని తెలిపారు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్‌లో అధిక వృద్ధి సామర్థ్యం కలిగిన వినూత్న కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి QIA కట్టుబడి ఉందని ఆ సంస్థ సీఈఓ మన్సూర్‌ ఇబ్రహీం అల్‌ మహ్మద్‌ పేర్కొన్నారు. భారత్‌లో తమ పెట్టుబడుల వివిధీకరణలో ఈ పెట్టుబడి భాగమని పేర్కొంది.

రియల్‌మీ నుంచి 2 స్మార్ట్‌ఫోన్లు.. వెలకమ్‌ ఆఫర్‌ కింద ₹1500 డిస్కౌంట్‌

రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌, దాని అనుబంధ సంస్థలకు దేశవ్యాప్తంగా అతిపెద్ద రిటైల్‌ నెట్‌వర్క్‌ ఉంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు మొత్తం 18,500 స్టోర్లు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొన్ని కంపెనీలను కొనుగోలు చేయడంతో పాటు అంతర్జాతీయ బ్రాండ్ల ఫ్రాంఛైజీలను రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ దక్కించుకుంటోంది. 2020లోనూ ఇలానే గ్లోబల్‌ ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌ ద్వారా 10 శాతం వాటాలను విక్రయించి రూ.47,265 కోట్లను రిలయన్స్‌ రిటైల్‌ సమీకరించింది. అప్పట్లో ఇదే అతిపెద్ద పెట్టుబడి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని