Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి: ఆర్‌బీఐ

దేశవ్యాప్తంగా జరిగే డిజిటల్‌ చెల్లింపుల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా జరిగే డిజిటల్‌ చెల్లింపులను సమీక్షించేందుకు 2018 మార్చిలో ఆర్‌బీఐ డిజిటల్‌ పేమెంట్స్‌ ఇండెక్స్‌ను ఏర్పాటు చేసింది. 

Published : 01 Feb 2023 01:10 IST

ముంబయి: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) చేపడుతున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల్లో (Digital Payments) గణనీయమైన వృద్ధి నమోదైంది. 2022 సెప్టెంబరు నాటికి డిజిటల్‌ చెల్లింపులు  24.13 శాతం మేర పెరిగినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దేశవ్యాప్తంగా జరిగే డిజిటల్‌ చెల్లింపులను సమీక్షించేందుకు 2018 మార్చిలో ఆర్‌బీఐ డిజిటల్‌ పేమెంట్స్‌ ఇండెక్స్‌ (RBI-DPI)ను ఏర్పాటు చేసింది. దాని ప్రకారం  ఆర్‌బీఐ-డీపీఐ 2021 మార్చి నాటికి ఈ సూచీ 270.59గా ఉండగా.. అదే ఏడాది సెప్టెంబరులో 304.06గా ఉంది. తాజా గణాంకాల ప్రకారం 2022 మార్చి చివరికి 349.30, సెప్టెంబరుకు ఇది 377. 46గా నమోదైంది.  

డిజిటల్‌ చెల్లింపులను ప్రజలు ఆదరిస్తున్నారనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని ఆర్‌బీఐ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన నగదు సంక్షోభంతో పాటు కరోనా సమయంలో నోట్ల వినియోగం తగ్గడంతో దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపులు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నగదు లావాదేవీల కోసం గంటల తరబడి బ్యాంకులో నిలబడటం, ఏటీఎం సెంటర్ల చుట్టూ తిరగడం వంటివి లేకపోగా, ఒక్క క్లిక్‌తో సులువుగా నగదు బదిలీ జరిగిపోతుండటంతో డిజిటల్‌ చెల్లింపులు పెరిగేందుకు దోహదపడ్డాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాకింగ్‌ రంగ నిపుణులు అభిప్రాపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని