RBI Repo rate: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీరేట్లు యథాతథం

RBI Repo rate: ఆర్‌బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ౬.౫౦ శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది.

Updated : 06 Apr 2023 14:00 IST

ముంబయిః మెజారిటీ నిపుణుల అంచనాలకు భిన్నంగా ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) వడ్డీరేట్ల (interest rates) పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం, బ్యాంక్‌ రేటు 6.75 శాతంగా కొనసాగుతాయని తెలిపారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయానికి ‘మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee)’ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 2023-24లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ గత ఏడాది మే నెల నుంచి కీలక వడ్డీరేట్లను పెంచుతూ వచ్చింది. ఇప్పటి వరకు రెపోరేటును ౨౫౦ బేసిస్‌ పాయింట్లు పెంచింది. ౨౦౨౩ ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ౬.౪౪ శాతంగా నమోదైంది. అంతక్రితం నెల ఇది ౬.౫౨ శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత పరిధి అయిన ఆరు శాతానికి పైనే స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు ఆర్‌బీఐకి ఇప్పటి వరకు అనివార్యమైంది.
(Also Read: రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి?)

2023 ఆశాజనకంగా ప్రారంభమైందని శక్తికాంత దాస్‌ అన్నారు. సరఫరా వ్యవస్థలు మెరుగయ్యాయని.. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని చెప్పారు. ఫైనాన్షియల్‌ మార్కెట్లు ఆశాజనకంగా ముందుకు సాగాయాన్నారు. కానీ, మార్చి నెలలో పరిస్థితులు నాటకీయంగా అనూహ్య మలుపు తీసుకున్నాయని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో బ్యాంకింగ్‌ రంగంలో వచ్చిన కుదుపు గందరగోళ పరిస్థితుల్ని సృష్టించిందని పేర్కొన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థల స్థిరత్వంపై అనుమానాలు తెరపైకి వచ్చాయన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణ కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీరేట్లను పెంచుతూనే ఉన్నాయన్నారు. ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణం కొంత వరకు అదుపులోకి వచ్చినప్పటికీ.. ఇప్పటికీ లక్ష్యిత పరిధి కంటే ఆవలే ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేట్ల పెంపు విషయంలో ఆయా కేంద్ర బ్యాంకులు కొంత నెమ్మదించినట్లు తెలిపారు. కానీ, పెంపు నుంచి ఇంకా పూర్తిగా విరమించలేదని గుర్తుచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగంలోని కీలకాంశాలు..

  • సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలనే నిర్ణయానికి కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఆమోదం.
  • రెపోరేటు పెంపులో విరామం కేవలం ఈ సమీక్షకు మాత్రమే పరిమితం. భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ఆర్‌బీఐ వెనుకాడబోదు.
  • దేశ బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి.
  • 2022-23లో ఆర్థిక వృద్ధిరేటు 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. 2023-24 జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంపు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది 5.2 శాతం, తొలి త్రైమాసికంలో 5.1 శాతంగా నమోదు కావొచ్చని అంచనా. ఆశించదగ్గ క్షీణత నమోదయ్యే వరకు ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుంది.
  • ఇటీవల బ్యాంక్‌ పతనాల పరిణామంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దాని పర్యవసానాలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది.
  • 2022-23లో రూపాయి కదలికలు క్రమబద్ధంగా కొనసాగాయి. ఆర్‌బీఐ దీనిపై దృష్టి కొనసాగిస్తుంది.
  • వివిధ బ్యాంకుల్లో క్లెయిం చేయని డిపాజిట్ల కోసం కేంద్రీకృత పోర్టల్‌ ఏర్పాటు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని