UPI lite: యూపీఐ లైట్‌ లిమిట్‌ పెంపు.. ఇకపై 500 వరకు పాస్‌వర్డ్‌ అక్కర్లేదు

UPI lite limit: యూపీఐ లైట్‌ లిమిట్‌ పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇకపై పిన్‌ లేకుండా రూ.500 వరకు చెల్లింపులు చేయొచ్చు.

Published : 10 Aug 2023 14:02 IST

ముంబయి: డిజిటల్‌ పేమెంట్స్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్‌లో (UPI lite) పేమెంట్‌ కోసం ఉన్న పరిమితిని రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సంద్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ నిర్ణయంతో యూపీఐ లైట్‌ ద్వారా రూ.500 వరకు పిన్‌ నమోదు చేయకుండానే సేవలను వాడుకోవచ్చు.

సింగిల్‌ లావాదేవీలో పరిమితి మొత్తాన్ని పెంచినప్పటికీ.. యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో లోడ్‌ చేసుకునేందుకు ఉన్న మొత్తాన్ని రూ.2 వేలకే పరిమితం చేశారు. యూపీఐ లైట్‌ చెల్లింపుల పరిమితిని పెంచాలన్న డిమాండ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. అయితే, టు-ఫ్యాక్టర్‌ అథంటికేషన్‌ లేకుండా చెల్లింపుల విషయంలో రిస్కులు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాలెట్‌ పరిమితిని పెంచలేదన్నారు. చెల్లింపుల పరిమితికి సంబంధించిన సూచనలను త్వరలో జారీ చేయనున్నట్లు శక్తికాంతదాస్‌ తెలిపారు.

కీలక వడ్డీరేట్లు యథాతథమే

మరోవైపు డిజిటల్‌ చెల్లింపులకు టెక్నాలజీని జోడించే ఉద్దేశంతో కొత్తగా ‘కన్వర్జేషనల్‌ పేమెంట్స్‌’ను తీసుకొస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ఇందుకోసం యూపీఐకి ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను (AI) జోడించనున్నామని తెలిపారు. దీనివల్ల ఏఐ ఆధారిత సిస్టమ్స్‌తో సంభాషిస్తూ సురక్షితంగా లావాదేవీలు పూర్తి చేయొచ్చని గవర్నర్‌ తెలిపారు. ఇది తొలుత హిందీ, ఇంగ్లీష్‌లో భాషల్లో  అందుబాటులోకి రానుంది. తర్వాత ఇతర భాషలను జోడిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎన్‌పీసీఐకి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని శక్తికాంత దాస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని