Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ రూ.15 వేల కోట్ల బాండ్ల విక్రయాలు?

Reliance: వివిధ రంగాల్లోకి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ ఎత్తున నిధుల సమీకరణను చేపడుతోంది. అందులో భాగంగా తాజాగా దేశీయ కరెన్సీ బాండ్లను విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Published : 02 Nov 2023 11:01 IST

దిల్లీ: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) భారీగా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దాదాపు రూ.15,000 కోట్లు విలువైన స్థానిక కరెన్సీ బాండ్ల విక్రయాల ద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. చర్చలు తుది దశలో ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి ఆంగ్లపత్రిక బ్లూమ్‌బెర్గ్‌కు వెల్లడించారు.

ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. స్థానిక కరెన్సీ బాండ్లలో రిలయన్స్‌ (Reliance Industries) ఈ స్థాయిలో నిధులను సమీకరించడం ఇదే తొలిసారి. అలాగే 2020 తర్వాత దేశీయ బాండ్ల ద్వారా నిధులను సేకరించడం కూడా ఇదే మొదటిసారని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. పెట్రోకెమికల్స్‌ వ్యాపారం నుంచి రిలయన్స్‌ క్రమంగా ఇతర రంగాలకూ వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ ఎత్తున నిధులను సమీకరిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ‘ఖతర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ’కి రిలయన్స్‌ రిటైల్‌ వాటాలు విక్రయించింది. అలాగే కేకేఆర్‌ అండ్‌ కంపెనీ నుంచి నిధులను సమీకరించింది.

గత కొన్ని నెలల్లో భారత్‌లో రుణ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (Reliance Industries)కు క్రిసిల్‌ రేటింగ్స్‌ AAA క్రెడిట్‌ స్కోర్‌ను ఇచ్చింది. మూడీస్‌, ఫిచ్‌ మాత్రం రిలయన్స్‌కు వరుసగా Baa2, BBB రేటింగ్‌ను కొనసాగిస్తున్నాయి.

సెప్టెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) నికర లాభం రూ.17,394 కోట్లు లేదా ఒక్కో షేరుకు రూ.25.71గా నమోదైంది. 2022-23 ఇదే  త్రైమాసికంలో లాభం రూ.13,656 కోట్ల (ఒక్కో షేరుకు రూ.19.92)తో పోలిస్తే ఇది 27.3 శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయాలు పెద్దగా మార్పు లేకుండా రూ.2.55 లక్షల కోట్లుగానే నమోదయ్యాయి. మరోవైపు కంపెనీ ఆర్థిక వ్యయాలు వార్షిక ప్రాతిపదికన 25.8 శాతం పెరిగి రూ.5,731 కోట్లకు చేరాయి. అధిక వడ్డీరేట్లు, మారక విలువ పతనం కొంత ప్రతికూలంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని