Mukesh Ambani: యంత్రాల కన్నా టాలెంట్‌పై పెట్టుబడితోనే అధిక లాభం.. ‘ఫ్యామిలీ డే’లో అంబానీ వ్యాఖ్యలు

Mukesh Ambani: రిలయన్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులైన ధీరూభాయ్‌ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే ‘రిలయన్స్‌ ఫ్యామిలీ డే’లో పాల్గొన్న ముకేశ్‌ అంబానీ ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. యంత్రాలపై పెట్టుబడి కంటే ప్రతిభపై పెట్టుబడి అధిక రాబడిని తెస్తుందన్నారు.

Published : 28 Dec 2023 21:37 IST

Mukesh Ambani | ముంబయి: ప్రపంచంలోని టాప్‌ -10 వ్యాపార సంస్థల్లో ఒకటిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani). రిలయన్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులైన ధీరూభాయ్‌ అంబానీ (91) జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే ‘రిలయన్స్‌ ఫ్యామిలీ డే’లో పాల్గొన్న ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. డిజిటల్ డేటా ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతను అందిపుచ్చుకొని గ్లోబల్‌ లీడర్‌గా కంపెనీ స్థానాన్ని సుస్థిరం చేయడమే రిలయన్స్‌ ప్రస్తుత లక్ష్యమని చెప్పారు.

‘వ్యాపారం కోసం దేశీయ, ప్రపంచ స్థాయిలో వాతావరణం శరవేగంగా మారుతోంది. ఆత్మసంతృప్తికి ఆస్కారం లేదు. నిరంతరం కొత్త ఆవిష్కరణల కారణంగా మార్కెట్‌లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే మేం అత్యున్నత స్థాయి లక్ష్యాల్ని పెట్టుకున్నాం. కొత్త రికార్డుల్ని సృష్టించడానికి ప్రయత్నించాం. అందువల్లే రిలయన్స్ ఈ స్థాయికి చేరుకుంది’ అని అంబానీ అన్నారు.

ఆజాద్‌ ఇంజినీరింగ్‌ లిస్టింగ్‌ అదుర్స్‌.. 7 రెట్లు పెరిగిన సచిన్‌ పెట్టుబడి!

ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరింస్తుందని ముకేశ్‌ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో రిలయన్స్‌ ప్రపంచలోని టాప్‌ 10 వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఎదుగుతుందన్నారు. ఈ సమావేశంలో భాగంగా మూడు కీలక అంశాల్ని ఉద్యోగులకు సూచించారు. ‘ఎల్లప్పుడూ కస్టమర్లకు విలువ ఇవ్వండి.. వారి అంచానాల్ని అందుకోండి. సమాజ విశ్వాసాన్ని గెలిచేలా కంపెనీ చర్యలు ఉండాలి. కస్టమర్ల ప్రేమ, నమ్మకాన్ని గెలుచుకొనేందుకు నిరంతరం సామర్థ్యాల్ని మెరుగుపరుచుకోండి’ అన్నారు.

డిజిటల్ డేటా ప్లాట్‌ఫారమ్‌లలో గ్లోబల్ లీడర్‌లలో తమ గ్రూప్ స్థానాన్ని సుస్థిరం చేయాలని అంబానీ ఈ సందర్భంగా సూచించారు. ‘ఉత్పాదకత, సామర్థ్యాన్ని సాధించడానికి ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ డిజిటల్‌ యుగంలో ప్రతిభ, డబ్బుతో పాటు సాంకేతికత కూడా ముఖ్యమైన అంశంగా మారింది. ఏఐ అవకాశాలను తయారీ రంగంలో కూడా ఉపయోగించుకోవటంలో ముందంజలో ఉండాలి. రానున్న ఏడాదిలో అన్ని వ్యాపారాల్లోనూ ఏఐ సాకేంతికతను అందిపుచ్చుకోవాలి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పనల పరిష్కారించే దిశగా ఏఐని అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన తన సిబ్బందికి సూచించారు. యంత్రాలపై పెట్టుబడి కంటే ప్రతిభపై పెట్టుబడి అధిక రాబడిని తెస్తుందని అంబానీ అన్నారు. 2023 భారత్‌తో పాటు రిలయన్స్‌కు కూడా గొప్ప సంవత్సరంగా పేర్కొన్నారు. 2024 మరింత మెరుగ్గా ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని