Satya Nadella: 2025 కల్లా 20 లక్షల మందికి AIలో శిక్షణ : సత్య నాదెళ్ల

కృత్రిమ మేధకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు రూపొదించడానికి భారత్‌ - అమెరికాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. 

Updated : 07 Feb 2024 15:30 IST

ముంబయి: భారత్‌లో 2025 కల్లా 20 లక్షల మందికి కృత్రిమ మేధ (AI)లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈవో, ఛైర్మన్‌ సత్య నాదెళ్ల (Satya Nadella) తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ముంబయికి చేరుకున్న ఆయన.. ఏఐ కోసం డేటాసెట్స్‌ రూపొందించే సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏఐ విషయంలో భారత్‌-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఏఐ శక్తివంతమైన కొత్త సాంకేతికత. దాని గురించి ఆందోళన చెందకుండా.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరింపచేయాలి. ఇందుకు అనుసరించాల్సిన విధి విధానాలు రూపొందించడంలో భారత్‌ - అమెరికాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ భాగస్వామ్యం ఇరుదేశాల ఆర్థికాభివృద్ధికి  తోడ్పడుతుంది. 2025 నాటికి ఈ రంగంలో భారత్‌లో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తాం. దేశ జీడీపీ పెరగడానికి ఏఐ దోహదపడుతుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ ఒకటి’’ అని సత్య నాదెళ్ల తెలిపారు. 

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు.. జోక్యం చేసుకోలేమన్న కేంద్రం..!

ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కీలక మైలురాయిని దాటింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మూడు ట్రిలియన్‌ డాలర్లు దాటిన రెండో కంపెనీగా అవతరించింది. గత కొంతకాలంగా ఓపెన్‌ ఏఐతో కలిసి మైక్రోసాఫ్ట్ ఏఐపై పరిశోధనలు చేస్తోంది. ఇందులోభాగంగా కొత్త టూల్స్‌ను ఆవిష్కరిస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 4కి సత్య నాదెళ్ల కంపెనీ సీఈవో బాధ్యతలు చేపట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆయన సంస్థ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని