Short Term Investments: స్వల్పకాల పెట్టుబడులకు మార్గాలు..!

స్వ‌ల్ప‌కాలం కోసం పెట్టుబ‌డులు పెట్టేవారు ల‌క్ష్యానికి ఉన్న స‌మ‌యం ఆధారంగా అధిక లిక్విడిటీ ఉన్న పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి

Published : 09 Jul 2022 16:40 IST


పెట్టుబ‌డుల గురించి ఆలోచ‌న వ‌స్తే..ఎక్కువ మంది ఆలోచించేది దీర్ఘకాలిక పెట్టుబ‌డుల గురించే. సాధార‌ణంగా పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, వివాహం, ప‌ద‌వీవిర‌మ‌ణ వంటి వాటికి ఎక్కువ మొత్తం అవ‌స‌రం కాబ‌ట్టి వాటికి డ‌బ్బు స‌మ‌కూర్చుకునేందుకు దీర్ఘ‌కాల‌ పెట్టుబ‌డుల గురించి ఆలోచిస్తారు. కానీ, స్వ‌ల్ప‌కాలిక అవ‌స‌రాల‌కు మాత్రం అప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బు ఏర్పాటు చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఇందుకోసం రుణం తీసుకుంటుంటారు.

అయితే, దీర్ఘ‌కాలిక అవ‌స‌రాల కోసం ఎలా డ‌బ్బు మ‌దుపు చేస్తున్నామో..అలాగే విహార యాత్ర‌లు, పిల్ల‌ల స్కూల్ ఫీజులు, ఖ‌రీదైన వ‌స్తువుల కొనుగోలు, బీమా ప్రీమియంలు, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, అత్య‌వ‌స‌ర‌నిధి ఏర్పాటు వంటి స్వ‌ల్ప‌కాలిక అవ‌స‌రాల కోసం కూడా డ‌బ్బు మ‌దుపు చేయ‌వ‌చ్చు. స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డిమార్గాలు రెండు ర‌కాలుగా ఉంటాయి. 1. స్థిరాదాయ‌న్నిచ్చేవి. 2. మార్కెట్‌తో అనుసంధాన‌మైన పెట్ట‌బుడులు. పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ట‌ర్మ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు వంటివి స్థిరాదాయాన్ని ఇస్తాయి. లిక్విడ్ ఫండ్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లు, మనీ మార్కెట్’ ఫండ్లు వంటివి మార్కెట్‌తో అనుసంధాన‌మై ఉంటాయి. 

నష్టభయం లేకుండా స్థిరాదాయాన్ని ఇచ్చే పెట్టుబడులను ఎంచుకోవాలనుకుంటే ఈ కింది పెట్టుబడి పథకాలను పరిశీలించవచ్చు.

స్వీప్ ఇన్ ఫిక్సిడ్ డిపాజిట్..
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉంటుంది. మ‌ధ్య‌లోనే బ్రేక్ చేస్తే పెనాల్టీ వ‌ర్తిస్తుంది, వ‌డ్డీ మొత్తం త‌గ్గిపోతుంది. అయితే, ఈ స్వీప్ ఇన్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మాత్రం ఎప్పుడైనా డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఖాతాదారుడు ముందుగా నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ డబ్బు ఖాతాలో డిపాజిట్ చేస్తే అద‌న‌పు మొత్తం స్వీప్ ఇన్ విధానం ద్వారా స్వ‌యం చాల‌కంగా ఫిక్సిడ్ డిపాజిట్ గా మారుతుంది. అవ‌స‌ర‌మైన‌ప్పుడు మ‌ళ్లీ పొదుపు ఖాతాకు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఎలాంటి పెనాల్టీ వ‌ర్తించ‌దు. వ‌డ్డీ రేట్లు సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటాయి. 

షార్ట్ టర్మ్ ఫిక్సిడ్ డిపాజిట్..
వీటి మెచ్యూరిటీ పిరియ‌డ్ 7 రోజుల నుంచి మొద‌లుకుని ఏడాది వ‌ర‌కు ఉంటుంది. వార్షిక వడ్డీరేటు 3.50-6.75 శాతం వరకూ ఉంటుంది. కనీస పెట్టబడి రూ.100, అయితే బ్యాంకును బట్టి క‌నీస డిపాజిట్ మొత్తం, వ‌డ్డీ రేట్లు మారుతుంటాయి.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్:
ఇవి 1,2,3,5 సంవత్సరాలకు అందుబాటులో ఉంటాయి. వార్షిక వడ్డీరేటు 6.90-7.70 శాతం వరకూ ఉంటుంది. కనీస పెట్టబడి రూ. 200 నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ట పరిమతి లేదు. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు (ఐదేళ్ల కాలపరిమితి టైమ్ డిపాజిట్లపై మాత్రమే) ఉంటుంది.

రిక‌రింగ్ డిపాజిట్లు..
బ్యాంకులు, పోస్టాఫీసు కూడా రిక‌రింగ్ డిపాజిట్ల‌ను అందిస్తాయి. అయితే పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ల‌కు 5 ఏళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది. వార్షిక వ‌డ్డీ రేటు 5.80 శాతం. అయితే బ్యాంకులు మాత్రం 6 నెల‌ల‌ నుంచి 10 ఏళ్ల వ‌ర‌కు వివిధ కాల‌పరిమితుల‌తో రిక‌రింగ్ డిపాజిట్ల‌ను అందిస్తున్నాయి. బ్యాంకును బ‌ట్టి వ‌డ్డీ రేటు మారుతుంది.

స్వల్పకాలం పాటు పెట్టుబడుల కోసం అనుకూలంగా ఉండే మార్కెట్‌తో అనుసంధాన‌మైన వివిధ ర‌కాల డెట్ మ్యూచువల్ ఫండ్లు..
లిక్విడ్ ఫండ్లు..
లిక్విడ్ ఫండ్లు 91 రోజుల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న..స్థిర ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడి సాధానాలైన‌, డిపాజిట్ స‌ర్టిఫికేట్లు, ట్రెజ‌రీ బిల్లులు, క‌మ‌ర్షియ‌ల్ పేపర్లు, ఇతర డెట్‌ సెక్యూరిటీల‌లో మదుపు చేస్తాయి. అంతేకాకుండా లిక్విడ్ పంఢ్ల‌కు లాక్ - ఇన్ పిరియ‌డ్ ఉండ‌దు, న‌గ‌దు ల‌భ్య‌త ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి అత్య‌వ‌స‌ర‌నిధి కోసం ఈ ర‌క‌మైన ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

‘అల్ట్రా షార్ట్ టర్మ్’ ఫండ్లు..
ఇవి డెట్ సెక్యూరిటీలు, మ‌నీ మార్కెట్ సాధ‌నాల్లో పెట్టుబ‌డి పెడ‌తాయి. కాబ‌ట్టి, ఇవి 3 నుంచి 6 నెలల కాలపరిమితితో వ‌స్తాయి. ఆరు నెల‌ల స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యం కోసం మ‌దుపు చేసేవారు ఈ విధ‌మైన పెట్టుబ‌డిని ఎంపిక చేసుకోవ‌చ్చు. ఈ కేటగిరీలో సగటున 6 నుంచి 8 శాతం వ‌ర‌కు కూడా రాబ‌డి పొంద‌వ‌చ్చు. 

ఈక్విటీ ఫండ్స్ లో కాలపరిమితి పెరిగీ కొద్దీ రిస్క్ తగ్గుతూ వస్తుంది. కానీ, డెట్ ఫండ్స్ లో కాలపరిమితి పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి, అతి స్వల్ప కాలం కోసం మాత్రమే వీటిలో మదుపు చేయడం మంచిది.

చివ‌రిగా..
స్వ‌ల్ప‌కాలం కోసం పెట్టుబ‌డులు పెట్టేవారు ల‌క్ష్యానికి ఉన్న స‌మ‌యం ఆధారంగా అధిక లిక్విడిటీ ఉన్న పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. అలాగే, రాబ‌డిని లెక్కించేట‌ప్పుడు ప‌న్ను తీసివేసిన త‌ర్వాత వ‌చ్చిన రాబ‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో కొంత రిస్క్ ఉంటుందని గమనించండి. రిస్క్ తీసుకోగలిగే వారు మాత్రమే వాటిలో మదుపు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని