Stock Market: వెల్లువెత్తిన అమ్మకాలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు పతనం!

Stock Market Closing Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి...

Updated : 23 Sep 2022 16:24 IST

ముంబయి: రేట్ల పెంపు, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ ఓ దశలో ఏకంగా 1,100 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌100, నిఫ్టీ మిడ్‌క్యాప్‌100 సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాల సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. బ్యాంక్‌, స్థిరాస్తి, వాహన రంగాల సూచీలు ఏకంగా 1 శాతం నష్టపోయాయి. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.4.90 లక్షల కోట్లు ఆవిరై రూ.276.66 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 59,005.18 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1100 పాయింట్లకు పైగా నష్టపోయిన సూచీ.. 57,981.95 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 1020.80 పాయింట్ల భారీ నష్టంతో 58,098.92 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 302.45 పాయింట్లు కోల్పోయి 17,327.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,642.15- 17,291.65 పాయింట్ల మధ్య కదలాడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.80.99 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో కేవలం మూడు మాత్రమే లాభపడ్డాయి. సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

పతనానికి ప్రధాన కారణాలివే..

రేట్ల పెంపు: అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచి 3.25 శాతానికి చేర్చింది. అలాగే భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చునని వ్యాఖ్యానించింది. బ్రిటన్‌, స్విట్జర్లాండ్‌ సైతం రేట్లను పెంచాయి.

ఆర్‌బీఐ చర్యలపై అంచనాలు: ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ కూడా ఆ దిశలోనే పయనించనుందన్న అంచనాలు బలపడుతున్నాయి. రేట్ల పెంచడం అనివార్యమని ఇప్పటికే స్పష్టమైనప్పటికీ.. పెంపు ఎంతమేర ఉండొచ్చనే దానిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో అంచనా వేసినట్లుగా 35 బేసిస్‌ పాయింట్లు కాకుండా 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచొచ్చని నిపుణులు అంటున్నారు. మరోవైపు రూపాయి పతనం.. ఆర్‌బీఐపై ఒత్తిడిని పెంచుతోంది.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్యలభ్యత కొరత: గత 40 నెలల్లో తొలిసారి భారత బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్యలభ్యత కొరత ఏర్పడింది. దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ గురువారం 50 వేల కోట్ల వేరియబుల్‌ రెపో రేటు వేలాన్ని నిర్వహించింది. ముందస్తు పన్ను చెల్లింపులు, రుణాలకు గిరాకీ పుంజుకోవడం, డిపాజిట్లు నెమ్మదించడమే ద్రవ్యలభ్యత కొరతకు కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

షేర్ల అధిక విలువ: ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ షేర్లతో పోలిస్తే భారత కంపెనీల స్టాక్స్‌ అధిక ధరల వద్ద ట్రేడువుతున్నాయని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయా స్టాక్స్‌ అన్నీ స్థిరీకరణ దిశగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

వృద్ధి అంచనాల్లో కోత: నొమురా, గోల్డ్‌మన్‌ శాక్స్‌, మూడీస్‌, ఏడీబీ.. వంటి ప్రముఖ సంస్థలన్నీ భారత వృద్ధిరేటు అంచనాలను కుదించాయి. చాలా సంస్థలు ఈ ఏడాది జీడీపీ వృద్ధి సగటున 7 శాతంగా ఉండొచ్చని అంచనా వేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని