Stock Market: స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 72 పాయింట్ల నష్టంతో 60,590 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 42 పాయింట్లు నష్టపోయి 17,829 వద్ద కొనసాగుతోంది.

Updated : 09 Feb 2023 09:38 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 72 పాయింట్ల నష్టంతో 60,590 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 42 పాయింట్లు నష్టపోయి 17,829 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.63 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. రేట్ల పెంపు ఇంకా కొనసాగుతుందని ఫెడరల్‌ రిజర్వ్‌ అధికారులు చేసిన వ్యాఖ్యలు మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. భారత మార్కెట్లలో విదేశీ మదుపర్లు బుధవారం రూ.736.82 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు రూ. 941.16 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు.

వరుస నష్టాల నుంచి నిన్న కాస్త కుదుటపడ్డ అదానీ కంపెనీ షేర్లు ఈరోజు మళ్లీ నష్టాల బాట పట్టాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏకంగా 15 శాతానికి పైగా నష్టాల్లో కొనసాగుతోంది. అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ ఆరంభంలోనే లోయర్‌ సర్క్యూట్‌ని తాకాయి.

ఈరోజు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: హిందాల్కో ఇండస్ట్రీస్‌, హెచ్‌పీసీఎల్‌, ఎల్‌ఐసీ, లుపిన్‌, జొమాటో, అదానీ టోటల్‌ గ్యాస్‌, అరబిందో ఫార్మా, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌, హెచ్‌ఏఎల్‌, ఐఆర్‌సీటీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, యునైటెటడ్‌  బ్రూవరీస్‌

గమనించాల్సిన స్టాక్స్‌..

అదానీ విల్మర్‌: డిసెంబరు త్రైమాసికంలో అదానీ విల్మర్‌ ఏకీకృత నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.246.16 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.211.41 కోట్లు. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.14,398.08 కోట్ల నుంచి రూ.15,515.55 కోట్లకు పెరిగింది.

అదానీ పవర్‌: అక్టోబరు- డిసెంబరులో అదానీ పవర్‌ ఏకీకృత నికర లాభం 96% క్షీణించి రూ.8.77 కోట్లకు పరిమితమైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.218.49 కోట్లు కావడం గమనార్హం. బొగ్గు దిగుమతి వ్యయాలు పెరగడం వల్లే లాభంలో క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,593.58 కోట్ల నుంచి రూ.8,290.21 కోట్లకు పెరిగింది.

ఎన్‌సీసీ: డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం ఎన్‌సీసీ రూ.3,903.73 కోట్ల మొత్తం ఆదాయాన్నీ, రూ.157.70 కోట్ల నికర లాభాన్నీ ఆర్జించింది. 2021-22 ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.3032.84 కోట్లు, నికర లాభం రూ.76.42 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరులో ఆదాయం రూ.10,659.64 కోట్లు, నికర లాభం రూ.418.34 కోట్లుగా నమోదయ్యాయి.

లిఖితా ఇన్‌ఫ్రా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి లిఖితా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం  రూ.84.67 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.15.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం  రూ.65.58 కోట్లు, నికర లాభం రూ.11.25 కోట్లుగా ఉన్నాయి.

పతంజలి ఫుడ్స్‌: డిసెంబరు త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌ (ఇంతకు ముందు రుచిసోయా ఇండస్ట్రీస్‌) రూ.269 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234 కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.6,280 కోట్ల నుంచి 26% పెరిగి రూ.7,929 కోట్లకు చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని