Alibaba: ‘అలీబాబా’లో అనూహ్య మార్పులు.. కంపెనీకి కొత్త ఛైర్మన్‌, సీఈఓ

Alibaba: అలీబాబా గ్రూప్‌ స్టాక్స్‌ పతనం కొనసాగుతోంది. మరోవైపు కరోనా నుంచి ఇంకా వ్యాపారం పుంజుకోవడం లేదు. ఈ తరుణంలో అనూహ్యంగా కంపెనీలో నాయకత్వ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.

Updated : 20 Jun 2023 12:28 IST

బీజింగ్‌: చైనాకు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ అలీబాబా (Alibaba)లో నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఎనిమిదేళ్లుగా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న డేనియల్‌ ఝాంగ్‌ (Daniel Zhang)ను పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జోసెఫ్‌ సాయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలీబాబా (Alibaba)లో కీలకంగా ఉన్న టావోబావో, మాల్‌ ఆన్‌లైన్‌ వాణిజ్య విభాగాలకు ఛైర్మన్‌గా ఉన్న ఎడ్డీ వూ.. అలీబాబా గ్రూప్‌నకు సీఈఓగా వ్యవహరించనున్నారు. కంపెనీ షేర్ల పతనం, కొవిడ్‌ తర్వాత పుంజుకోవడంలో సంస్థ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో నాయకత్వ మార్పు జరగడం గమనార్హం.

కొత్త బాధ్యతలు స్వీకరించనున్న జోసెఫ్‌ సాయ్‌, ఎడ్డీ వూ.. ఇరువురూ అలీబాబా (Alibaba) సహ- వ్యవస్థాపకుడు ‘జాక్‌ మా’ (Jack Ma)కు నమ్మకస్థులు కావడం గమనార్హం. పైగా వీరివురూ కంపెనీ సహ- వ్యవస్థాపకులు కూడా. క్లౌడ్ కంప్యూటింగ్‌ నుంచి లాజిస్టిక్స్‌, అంతర్జాతీయ వాణిజ్యంలో కంపెనీని పటిష్ఠపరుస్తామని ఇటీవలే అలీబాబా ప్రకటించింది. ఇందుకోసం ఆరు మార్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో ఝాంగ్‌ కీలక పదవి నుంచి వైదొలగనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

క్లౌడ్‌ బిజినెస్‌కు ఝాంగ్‌ నేతృత్వం కొనసాగుతుందని అలీబాబా (Alibaba) గ్రూప్ తెలిపింది. 2015లో ఝాంగ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ ఆన్‌లైన్‌, భౌతిక స్టోర్లను మిళితం చేస్తూ ఆయన తీసుకొచ్చిన కొత్త రిటైల్‌ వ్యాపార నమూనా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మాల్స్‌, సూపర్‌మార్కెట్ల విభాగంలో అలీబాబా అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో చైనా (China)లోనే అత్యంత విలువైన కంపెనీగా అలీబాబా అవతరించింది. కానీ, 2020 నుంచి వివిధ కారణాలరీత్యా చైనా (China) ప్రభుత్వం జాక్‌ మా (Jack Ma) సహా ఆయనకు చెందిన యాంట్‌ గ్రూప్‌పై ఆంక్షలు ప్రారంభించింది. దీంతో అలీబాబా సైతం పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఆపై కరోనా కూడా దెబ్బకొట్టడంతో వ్యాపారం తిరిగి కోలుకోలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని