IPO Rush: ఒకే రోజు 3 ఐపీఓలు.. ₹1700 కోట్లు సమీకరణే లక్ష్యం

IPO News: మూడు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1700 కోట్లు సమీకరించనున్నాయి. వీటి సబ్‌స్క్రిప్షన్‌ ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు అందుబాటులో ఉంటాయి.

Published : 06 Feb 2024 15:35 IST

Latest IPOs | దిల్లీ: దేశీయ మార్కెట్లలో ఐపీఓ సందడి కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లలో అనుకూల పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతున్నాయి. కొత్త ఏడాదిలో ఇప్పటికే ఐదు కంపెనీలు రూ.3,266 కోట్లు మార్కెట్ల నుంచి సమీకరించగా.. తాజాగా మరో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. రాశి పెరిఫెరల్స్‌, జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1700 కోట్లు సమీకరించనున్నాయి. ఫిబ్రవరి 7న వీటి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 9న ముగియనున్నాయి.

2024లో ఐపీఓ మార్కెట్‌లో బుల్లిష్‌ ఔట్‌లుక్‌ ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదే అదునుగా నిధులు సమీకరించుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది సైతం మార్కెట్లో ఇదే ఉత్సాహం కనిపించింది. మొత్తం 58 కంపెనీలు రూ.52,637 కోట్ల నిధులను సమీకరించాయి. 2022లో 40 కంపెనీలు రూ.59,302 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ అప్పుడే ఐపీఓకు వచ్చింది.

త్వరలో పసిడి బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌.. ఆన్‌లైన్‌లో ఎలా కొనాలి?

ఐపీఓల వివరాలు ఇవీ..

  • ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ ఉత్పత్తులను డిస్ట్రిబ్యూటర్‌ రాశి పెరిఫెరల్స్‌ సంస్థ (Rashi Peripherals IPO) పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించనుంది. పూర్తిగా ఫ్రెష్‌ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ మొత్తం సేకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.295-311గా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రుణాలు తీర్చేందుకు, వర్కింగ్‌ క్యాపిటల్‌, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
  • ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు టీపీజీ, మోర్గాన్‌ స్టాన్లీ మద్దతు కలిగిన జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ (Jana Small Finance Bank IPO) ద్వారా రూ.570 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ.462 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, మిగిలిన రూ.108 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.393-414గా నిర్ణయించారు. ఈ నిధులను భవిష్యత్తు అవసరాల కోసం, క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో మెరుగుదలకు వినియోగించనున్నారు.
  • క్యాపిటల్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (Capital Small Finance Bank IPO) రూ.450 కోట్లు విలువైన ఫ్రెష్‌ షేర్ల జారీ ద్వారా, రూ.73 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనుంది. మొత్తంగా రూ.523 కోట్లు సమీకరించనుంది. ఐపీఓ కోసం ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.445-468గా నిర్ణయించింది. ఐపీఓ నిధులను భవిష్యత్‌ అవసరాల కోసం వినియోగించనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని