Spam Calls: ఇకపై స్పామ్‌, ప్రమోషనల్‌ కాల్స్‌కు గుడ్‌బై!

స్పామ్‌ కాల్స్‌ (Spam Calls) నుంచి అవగాహనతో కొంత మంది యూజర్లు బయటపడుతుంటే.. అవగాహనలేమితో మరికొంత మంది మోసపోతున్నారు. ఈ తరహా ఫోన్‌ కాల్స్‌ నుంచి మొబైల్‌ యూజర్లకు విముక్తి కలిగించేందుకు ట్రాయ్‌ (TRAI) కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. 

Updated : 01 May 2023 20:03 IST

దిల్లీ: సాధారణంగా మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని నంబర్‌ నుంచి ఫోన్‌ రాగానే ఎవరు చేస్తున్నారనే ఆసక్తితో కాల్‌ అటెండ్ చేస్తాం. అవతలి వ్యక్తులు ఫలానా బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నాం.. లోన్‌ కావాలా?, క్రెడిట్‌ కార్డ్‌ ఇస్తామనే మాట వినగానే అది స్పామ్‌ కాల్‌ (Spam Call) అని తెలిసి పట్టరానంత కోపం వస్తుంది. మరోవైపు లాటరీ గెలుచుకున్నారని, క్రెడిట్‌/డెబిట్ కార్డు గడువు ముగిసిందంటూ మోసపూరిత కాల్స్‌ వస్తుంటాయి.

ఇలాంటి స్పామ్‌/స్కామ్‌ కాల్స్‌ నుంచి అవగాహనతో కొంత మంది యూజర్లు బయటపడుతుంటే.. అవగాహనలేమితో మరికొంత మంది మోసపోతున్నారు. ఈ తరహా ఫోన్‌ కాల్స్‌ నుంచి మొబైల్‌ యూజర్లకు విముక్తి కలిగించేందుకు టెలికామ్‌ నియంత్రణ సంస్థ (TRAI) కొత్త నిబంధనను నేటి (మే 1, 2023) నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. 

ఎలా పనిచేస్తుంది?

ఈ నిబంధన ప్రకారం టెలికాం నెట్‌వర్క్‌ ఆపరేటర్లు (ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌) ఫోన్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్ సేవల్లో కృత్రిమ మేధ (AI) ఆధారిత స్పామ్‌ ఫిల్టర్స్‌ను ఉపయోగించాలి. ఈ ఫిల్టర్స్‌ వేర్వేరు వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే నకిలీ, మార్కెటింగ్‌ కాల్స్‌తోపాటు మెస్సేజ్‌లను గుర్తించి అడ్డుకుంటాయని ట్రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దీని వల్ల యూజర్లు స్పామ్‌ లేదా స్కామ్‌ కాల్స్‌ (Scam Calls) మోసాలకు గురికాకుండా ఉంటారని వెల్లడించింది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు ఈ ఫిల్టర్ల ద్వారా సేవలు అందించేందుకు అంగీకరించాయి. ఎయిర్‌టెల్‌ ఇప్పటికే వీటిని అమలు చేస్తుండగా, త్వరలో జియో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. 

ప్రమోషనల్‌ కాల్స్‌ వద్దు.. కాలర్‌ ఐడీ ఉంటే మేలు

టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు 10 అంకెల మొబైల్‌ నంబర్‌ ద్వారా చేసే ప్రమోషనల్‌ కాల్స్‌ను అనుమతించవద్దని ట్రాయ్‌ సూచించింది. వీటి ద్వారా నేరగాళ్లు యూజర్లకు ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతాల్లోని నగదు దొంగిలిస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. దీంతోపాటు ఫోన్‌ కాల్ ఎవరి నుంచి వస్తుందనేది తెలుసుకునేందుకు వీలుగా ఫోన్‌ చేస్తున్న వ్యక్తి ఫొటో, పేరు మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించేలా కాలర్‌ ఐడీ (Caller ID) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. 

ఈ ఫీచర్‌తో ఫోన్‌ కాల్స్‌ ద్వారా జరిగే సైబర్‌ నేరాలకు అడ్డుకోవచ్చని ట్రాయ్‌ అభిప్రాయపడుతోంది. అయితే, గోప్యతా కారణాల రీత్యా ఎయిర్‌టెల్‌, జియో సంస్థలు ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు ఆసక్తి వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాలర్‌ ఐడీ అమలుకు సంబంధించి టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు, ట్రాయ్‌ మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని