US: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక నిర్ణయం.. మరోసారి పెరిగిన వడ్డీరేట్లు

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. 0.25 శాతం మేర వడ్డీరేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 16 ఏళ్ల గరిష్ట స్థాయికి వడ్డీరేట్లు చేరుకున్నాయి. 

Published : 04 May 2023 01:44 IST

అమెరికా: అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరలను స్థిరీకరించేందుకు మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. తాజాగా 25 బేసిస్‌ పాయింట్లు (0.25 శాతం) వడ్డీరేట్లు పెంచడంతో 16 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచడం గత 14 నెలల్లో ఇది పదోసారి. పెంచిన ప్రకారం ప్రస్తుతం వడ్డీ రేట్లు 5 నుంచి 5.25 శాతానికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కీలక వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో హౌసింగ్‌, కీలక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే వడ్డీరేట్ల పెంపు ఇదే చివరిది కావచ్చని ఫెడ్‌ సంకేతాలు ఇచ్చింది. వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తర్వాత ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ మీడియాతో కీలక విషయాలు వెల్లడించారు. ఇకపై అదనపు వడ్డీరేట్లు పెరగకపోవచ్చని అన్నారు. ఇదొక ముఖ్యమైన మార్పుగా ఆయన అభివర్ణించారు. ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరడంతో కట్టడి చేసేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ గతకొన్ని నెలలుగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని