Vibhor Steel Listing: అదరగొట్టిన విభోర్‌ స్టీల్‌ షేర్లు.. ఒక్కో లాట్‌పై ₹27,126 లాభం

Vibhor Steel Listing | గతవారం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్న విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ లిమిటెడ్‌ షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే మదుపర్లకు 181 శాతం వరకు లాభాన్నిచ్చాయి.

Published : 20 Feb 2024 13:31 IST

ముంబయి: స్టీల్‌ పైపుల తయారీ సంస్థ విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ షేర్లు అరంగేట్రంలో అదరగొట్టాయి. ఐపీఓలో ఇష్యూ ధర రూ.151 కాగా.. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 181.46 శాతం లాభంతో రూ.425 దగ్గర లిస్టయ్యింది. (Vibhor Steel Tubes Listing). బీఎస్‌ఈలో 178.81 శాతం పుంజుకొని రూ.421 దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభించింది. తర్వాత షేరు విలువ 192.72 శాతం పెరిగి రూ.442 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది.

ఐపీఓలో కనీసం రూ.14,949తో 99 షేర్లు (ఒక లాట్‌) సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలని విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌  నిర్దేశించింది. దీంతో లిస్టింగ్‌లో మదుపర్లు ఒక్కో లాట్‌పై రూ.27,126 లాభాన్ని పొందారు. అప్పర్‌ సర్క్యూట్‌ వద్ద రూ.28,809 ఆర్జించినట్లయింది. లిస్టింగ్‌లో కంపెనీ మార్కెట్‌ విలువ బీఎస్‌ఈలో రూ.838.14 కోట్లుగా నమోదైంది. ఈ ఐపీఓ (IPO) ఫిబ్రవరి 13- 15 మధ్య జరిగింది. షేర్ల ధరల శ్రేణి రూ.141-151గా నిర్ణయించారు.

ఐపీఓ (Vibhor Steel Tubes IPO) ద్వారా సమీకరించిన నిధులను నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు విభోర్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ తెలిపింది. భారీ ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో ఉపయోగించే అత్యున్నత నాణ్యత కలిగిన స్టీల్‌ ట్యూబులు, పైపులను ఈ కంపెనీ తయారు చేస్తుంటుంది. చమురు, నీరు, గ్యాస్‌ సరఫరా చేసే వాటితో పాటు వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే పైపులనూ అందిస్తుంది. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసే లోహపు బ్యారియర్లను సైతం తయారు చేస్తుంది. జిందాల్ పైప్స్‌ ఈ కంపెనీ ప్రధాన కస్టమర్లలో ఒకటి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని