PM US Tour: మోదీ టూర్‌.. భారత్‌లో పెట్టుబడులకు టెక్‌ కంపెనీల హామీ

మోదీ పర్యటన నేపథ్యంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన బిగ్‌ టెక్‌ కంపెనీలు ముందుకొచ్చాయి. సాంకేతికంగా సాయం అందిస్తామని ప్రకటించాయి.

Published : 24 Jun 2023 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా ప్రసిద్ధ టెక్‌ కంపెనీలైన అమెజాన్‌ (Amazon) గూగుల్‌ (Google), మైక్రోసాఫ్ట్‌ (Microsoft) భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే ఆయా సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టగా.. ఆ పెట్టుబడులను మరింత విస్తరించడంతో పాటు సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. ప్రధాని మోదీ (PM modi) అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయా సంస్థలు భారత్‌లో పెట్టుబడులకు హామీ ఇచ్చాయి.

రాబోయే ఏడేళ్లలో 15 బిలియన్‌ డాలర్ల మేర భారత్‌లో పెట్టుబడులు పెడుతామని అమెజాన్‌ సంస్థ హామీ ఇచ్చింది. దీంతో భారత్‌లో కంపెనీ మొత్తం పెట్టుబడుల విలువ 26 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ మేరకు అమెజాన్‌ సీఈఓ యాండీ జాస్సీ ఓ ప్రకటన విడుదల చేశారు. కోటి చిన్న వ్యాపారాలను డిజిటైజ్‌ చేసేందుకూ అమెజాన్‌ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 2025 నాటికి భారత్‌ నుంచి 20 బిలియన్‌ విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అమెజాన్‌ ఇండియా ప్రత్యక్షంగా పరోక్షంగా 13 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని వివరించారు. 

మరోవైపు గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఆపరేషన్స్‌ను ప్రారంభించబోతున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. ఇండియా డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్న విషయాన్ని ప్రధానితో పంచుకున్నట్లు పిచాయ్ వివరించారు. అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అయిన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల.. భారత పౌరుల జీవనాన్ని టెక్నాలజీ ముఖ్యంగా ఏఐ ఎలా మార్చబోతోందన్నదీ పంచుకున్నారు. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్‌ కట్టుబడి ఉందని భేటీ అనంతరం నాదెళ్ల పేర్కొన్నారు. ఇప్పటికే ప్రబుత్వ కార్యక్రమాల విషయంలో సహాయం కోసం ‘జుగల్బందీ’ పేరిట మొబైల్లో పనిచేసే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో తీసుకొచ్చింది. ఏ భాషలో ప్రశ్న అడిగినా అర్థం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందిస్తుంది.

మరోవైపు గుజరాత్‌లో 2.75 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.22,540 కోట్ల) మొత్తం పెట్టుబడితో సెమీకండక్టర్‌ అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు మైక్రాన్‌ ప్రకటించింది. ఈ ఏడాదే ప్లాంటు పనులు ఆరంభమై, వచ్చే ఏడాదికి ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ వల్ల 5000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 15000 మందికి కమ్యూనిటీ ఉద్యోగాలు వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని