Reliance AGM: 5జీ ఫోన్‌.. 5జీ ప్లాన్స్‌.. రిలయన్స్‌ ఏజీఎం రానున్న ప్రకటనలు ఇవే!

RIL AGM Expectations: ఆగస్టు 28న రిలయన్స్‌ ఏజీఎం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సారీ పలు కీలక ప్రకటనలు ఉండే అవకాశం కల్పిస్తోంది.

Updated : 26 Aug 2023 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముకేశ్‌ అంబానీకి (Mukesh ambani) చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 46వ వార్షిక సాధారణ సమావేశం (Reliance AGM) ఆగస్టు 28న జరగనుంది. 2016లో జియో టెలికాం నెట్‌వర్క్‌ లాంచింగ్‌ అనంతరం రిలయన్స్‌ ఏజీఎంల పట్ల ఆసక్తి మొదలైంది. సామాన్యులకూ కనెక్ట్‌ అయ్యే విధంగా ప్రతి ఏజీఎంలోనూ ఏదో ఒక ప్రకటన ఉంటూ వస్తోంది. దీంతో ఈ సారి ఏజీఎంలో ఎలాంటి ప్రకటనలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. టెలికాం, రిటైల్‌, ఎనర్జీ వంటి కీలక రంగాలపై ఈ సారి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది.

5జీ ప్లాన్స్‌: రిలయన్స్‌ జియో 2016లో దేశీయ టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు వేదికైంది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా అవతరించింది. గతేడాది 5జీ సేవలనూ ప్రారంభించింది. అయితే ప్రస్తుతం జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద అపరిమిత 5జీ డేటాను జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఏజీఎంలో 5జీ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, 4జీ ధరల్లోనే ఇవీ ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

చంద్రయాన్‌-3 నేర్పే ఆర్థిక పాఠాలు

5జీ ఫోన్‌: ‘2జీ ముక్త్‌భారత్‌’ నినాదంతో జియో ఇప్పటికే పలు ఫోన్లను లాంచ్‌ చేసింది. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే తక్కువ ధరలో ఈ ఫోన్‌ ధరలు, టెలికాం ప్లాన్లూ ఉంటాయి. ఇదే కోవలో గూగుల్‌తో కలిసి ఓ 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు గతేడాది రిలయన్స్‌ ప్రకటించింది. ఈ సారి రెండు ఫోన్లను తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. వీటి ధరలు ఎంత? ఏమేం ఫీచర్లు ఉంటాయి? వీటికోసం స్పెషల్‌ ప్లాన్లు తీసుకొస్తారా? అనేది తెలియాలి.

ఎయిర్‌ ఫైబర్‌.. కొన్ని రోజులు ఫ్రీ!: టెలికాం సర్వీసులతో పాటు ఫైబర్‌ సేవలనూ అందిస్తోంది జియో. త్వరలో ఫైబర్‌ కేబుల్స్‌ అవసరం లేకుండా ఎయిర్‌ఫైబర్‌ పేరుతో ఓ 5జీ డివైజ్‌నూ జియో తీసుకురాబోతోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ ఈ తరహా ఫైబర్‌ డివైజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఏజీఎంలో జియో ఎయిర్‌ఫైబర్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. డివైజ్‌ లాంచ్‌ చేసిన కొన్ని రోజుల వరకు కొనుగోలుపై డిస్కౌంట్‌ లేదా కొంత కాలం పాటు ఫ్రీ ట్రయల్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ చేసుకోవాలా?.. ఇలా చేయండి..

ఐపీఓలపై అప్‌డేట్‌: రిలయన్స్‌ నుంచి రానున్న ఐదేళ్లలో రెండు ఐపీఓలు రానున్నట్లు రిలయన్స్‌ 2019లోనే వెల్లడించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌లో ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ రూ.8,278 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌ ఐపీఓకు సంబంధించి ఏజీఎంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ గురించీ అప్‌డేట్‌ ఉండే అవకాశం ఉంది. ఇదే ఏజీఎంలో క్లీన్‌ ఎనర్జీలో పెట్టుబడుల గురించీ ఏవైనా ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గిగా ఫ్యాక్టరీల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలూ వచ్చే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఏజీఎం ప్రారంభం కానుంది. యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని