Chandrayaan-3: చంద్రయాన్‌-3 నేర్పే ఆర్థిక పాఠాలు

చంద్రయాన్‌-3... సంక్లిష్టమైన ఓ ప్రయోగాన్ని భారత్‌ సుసాధ్యం చేసి చూపించింది. వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు, లక్ష్యం చేరాలనే పట్టుదల.. ఇవే సోపానాలుగా సాధించిన విజయం ఇది.

Updated : 25 Aug 2023 12:22 IST

చంద్రయాన్‌-3... సంక్లిష్టమైన ఓ ప్రయోగాన్ని భారత్‌ సుసాధ్యం చేసి చూపించింది. వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు, లక్ష్యం చేరాలనే పట్టుదల.. ఇవే సోపానాలుగా సాధించిన విజయం ఇది. ఈ నేపథ్యంలో  ఈ ప్రయోగం నుంచి మనమూ కొన్నిఆర్థిక పాఠాలు నేర్చుకోవచ్చు. అవేమిటో చూద్దామా..

ఒక లక్ష్యం సాధించాలంటే.. దానికి ఎంతో ప్రణాళిక అవసరం. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్‌ విజయానికి బాటలు వేసుకోవాలి. పెట్టుబడులు ప్రారంభించిన రోజు వాటి అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది తెలియకపోవచ్చు. కానీ, దీర్ఘకాలం ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు అందే లాభాలు అధికంగా ఉంటాయి.


అవగాహనతో..

మన చుట్టూ తిరిగే చంద్రుడిపై ఏం ఉంది.. ఇదే ఆసక్తితో చంద్రయాన్‌-3 కోసం తమ పరిజ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించారు. అదే విధంగా మన చుట్టూ ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఒకప్పటితో పోలిస్తే పెట్టుబడి పథకాల తీరు మారిపోయింది. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఖర్చులూ పెరిగాయి. దీన్ని మించి రాబడి సంపాదించే పథకాలను ఎంచుకోవాలి. సంప్రదాయ పద్ధతుల్లోనే పెట్టుబడులు పెడితే.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. వ్యక్తిగత ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాం.. రాబోయే రోజుల్లో ఏం సాధించాలి అనేది ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి.  


నష్టభయం తట్టుకునేలా..

చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకోవడం ఎంతో నష్టభయంతో కూడుకున్న ప్రయోగం. ఎన్నో అంశాలు కలిసి వచ్చినప్పుడే అది సఫలం అవుతుందని శాస్త్రవేత్తలకూ తెలుసు. వాటన్నింటికోసం వారు సిద్ధమయ్యే ముందుకు వెళ్లారు. పెట్టుబడుల తీరూ అంతే. ప్రతి పెట్టుబడికి ఎంతో కొంత నష్టభయం ఉంటుంది. సురక్షిత పథకాల్లోనూ రాబడి తక్కువ అనే నష్టం ఉంటుంది. ఒక పథకాన్ని ఎంచుకునేటప్పుడు అందులో ఉన్న ప్రతికూలతలు ఏమిటి? వాటిని ఎలా అధిగమించాలి? అనే వ్యూహాలు తప్పనిసరిగా ఉండాలి. ఒకసారి నష్టం వచ్చింది కదా అని ఎప్పుడూ అలాగే అవుతుందని అనుకోవద్దు. చంద్రయాన్‌-2 నుంచి నేర్చుకున్న పాఠాలు చంద్రయాన్‌-3లో ఉపయోగపడ్డాయి. అదే విధంగా పెట్టుబడిదారులూ తమ గత అనుభవాలతో పెట్టుబడులను నిర్వహించాలి. విజయవంతమైన మదుపరులు తమ పోర్ట్‌ఫోలియోలో నష్టాలను తెచ్చే వాటిని సమయానుకూలంగా సర్దుబాటు చేయాలి. మార్కెట్‌ పెరుగుతున్న సమయంలో లాభాలను స్వీకరించడం, తగ్గుతున్నప్పుడు పెట్టుబడులు పెట్టడం... వైవిధ్యంగా ఉండేలా చూసుకోవడం.. నష్టభయాన్ని తగ్గించుకునేందుకు ఎంచుకోవాల్సిన సూత్రాలు.


తక్కువ పెట్టుబడితో..

లక్ష్యం భారీగా ఉన్నంత మాత్రాన పెద్ద ఎత్తున పెట్టుబడి అవసరం ఉండకపోవచ్చు. చంద్రయాన్‌-3 అది రుజువు చేసింది. ఒక హాలీవుడ్‌ సినిమా ఖర్చుకన్నా తక్కువ బడ్జెట్‌తోనే ఈ ప్రయోగం పూర్తయ్యింది. అంటే, ఇక్కడ ఆర్థిక ప్రణాళిక ఎంత కచ్చితంగా ఉందో తెలుస్తుంది. మనమూ ఈ సూత్రాన్ని నేర్చుకోవాలి. ప్రతి పనికీ ఒక బడ్జెట్‌ ఉండాలి. దాని ప్రకారమే ముందుకు వెళ్లాలి. ఉద్యోగం సంపాదించినప్పటి నుంచీ వీలైనంత పొదుపు చేయడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం, దీర్ఘకాలం కొనసాగడం వల్ల తక్కువ మొత్తంతోనూ పెద్ద నిధిని సాధించేందుకు వీలవుతుంది.  


లక్ష్యం సాధించాలనే పట్టుదల..

చంద్రయాన్‌-2 విజయం సాధించలేదు. కానీ, ఇస్రో అంతటితో ఆగలేదు. చంద్రున్ని చేరాలనే లక్ష్యాన్ని వదలలేదు. మార్కెట్లు పడిపోవడం, ఆర్థిక మాంద్యం.. ఉద్యోగం కోల్పోవడం ఇలా వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి. వీటిన్నింటినీ సానుకూలంగానే స్వీకరించాలి. ఆర్థిక లక్ష్యాలు ఏమిటన్నది నిర్ణయించుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని చేరాలనే తపనతోనే ముందడుగు వేయాలి. సరైన పెట్టుబడులు పెట్టాలి. వాటిలో దీర్ఘకాలం కొనసాగాలి. అదే సమయంలో వాటి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం   చేరేందుకు మార్గం సుగమమవుతుంది.


వేచి చూస్తేనే..

రానున్న రోజుల్లో చేసే ఎన్నో ప్రయోగాలకు చంద్రయాన్‌-3 స్ఫూర్తినిస్తుంది. దీన్ని దీర్ఘకాలిక దృష్టితో చూడాలి. సంపద సృష్టి నెమ్మదిగా సాగే ఒక ప్రక్రియ. అంకితభావం, క్రమశిక్షణ, సహనం ఇక్కడ ఎంతో అవసరం. తొందరపడితే అసలుకే మోసం వస్తుంది. స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు ఆందోళన చెందకూడదు. లాభాలను సంపాదించే క్రమంలో దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. ఇదే మనకు చంద్రయాన్‌-3లాంటి విజయాన్ని అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని