Nasiruddin Ansari: యూట్యూబర్‌పై సెబీ కొరడా.. రూ.17 కోట్లు కట్టాలని ఎందుకు ఆదేశించింది?

Nasiruddin Ansari: సామాజిక మాధ్యమాల వేదికగా స్టాక్‌ సిఫార్సులను అందిస్తున్న నసీరుద్దీన్‌ అన్సారీపై సెబీ నిషేధం విధించింది. ఆయన బాప్‌ ఆఫ్‌ చార్ట్‌ పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Updated : 26 Oct 2023 15:01 IST

ముంబయి: ఇటీవల సామాజిక మాధ్యమాల్లో స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి చాలా సమాచారం అందుబాటులోకి వస్తోంది. చాలా మంది తమకు తాము స్టాక్‌ మార్కెట్‌ నిపుణులుగా చెబుతూ కొన్ని స్టాక్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా మంది సామాన్యులు నష్టపోతున్నారు. ఇలాంటి ఉదంతాలను అరికట్టేందుకు సెబీ (SEBI) నడుం బిగించింది. తాజాగా మహమ్మద్‌ నసీరుద్దీన్‌ అన్సారీ (Nasiruddin Ansari) అనే వ్యక్తిని స్టాక్‌ మార్కెట్‌ నుంచి నిషేధించింది. ఆయన నిర్వహిస్తున్న సంస్థ ‘బాప్‌ ఆఫ్‌ చార్ట్‌ (Baap Of Chart)’ను సైతం నిలిపివేయాలని ఆదేశించింది.

స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన పేరుతో వివిధ కోర్సులు నిర్వహిస్తూ అన్సారీ (Nasiruddin Ansari) కొన్ని స్టాక్‌లను మదుపర్లకు సిఫార్సు చేస్తున్నాడు. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నాడు. తన కోర్స్‌లో చేరిన వారికి కచ్చితమైన రాబడి ఉంటుందంటూ సామాన్యులను ప్రభావితం చేస్తున్నాడు. వివిధ కోర్సుల పేరిట సామాన్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని.. వారిని బలవంతంగా సెక్యూరిటీ మార్కెట్‌లోకి లాగుతున్నారని గుర్తించిన సెబీ (SEBI) అతణ్ని మార్కెట్‌ నుంచి నిషేధించింది. కోర్సుల పేరిట సామాన్య ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన రూ.17.2 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

అన్సారీ (Nasiruddin Ansari) ప్రధానంగా సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్‌, ఎక్స్‌ (ట్విటర్‌), ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్, టెలిగ్రాం వేదికగా స్టాక్‌లను సిఫార్సు చేస్తున్నాడు. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్న తన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని కోర్సులను తీసుకోవాలని ప్రభావితం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ మార్కెట్లకు సంబంధించి 19 కోర్సులను విక్రయిస్తున్నాడు. వీటిలో నాలుగింటిలో కచ్చితమైన రాబడి ఉంటుందని హామీ ఇస్తున్నాడు. ‘బాప్‌ ఆఫ్‌ చార్ట్‌ (Baap Of Chart)’ యూట్యూబ్‌ ఛానెల్‌కు 4.43 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉండడం గమనార్హం. దీంట్లో ఉన్న వీడియోలకు ఏడు కోట్లకు పైగా వ్యూస్‌ ఉన్నాయి. ‘బాప్‌ ఆఫ్‌ చార్ట్‌ ఆప్షన్‌ హెడ్జింగ్‌’ టెలిగ్రాం ఛానెల్‌కు 53,000 సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాలో 59 వేలు, ఎక్స్‌లో 78 వేల మంది బాప్‌ ఆఫ్‌ చార్ట్‌ (Baap Of Chart)ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. వాట్సాప్‌ ఛానెల్‌లోనూ 13 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీటితో పాటు ఆయన తరచూ నిర్వహించే వర్క్‌షాప్‌లకు వందలాది మంది హాజరవుతున్నారు.

వివిధ కోర్సులు, వర్క్‌షాప్‌ల ద్వారా నసీరుద్దీన్‌ ఇప్పటి వరకు దాదాపు రూ.13.78 కోట్లు వసూలు చేసినట్లు సెబీ (SEBI) దర్యాప్తులో తేలింది. మరోవైపు రూ.3.42 కోట్లు యూపీఐ ఐడీల ద్వారా సేకరించారు. మొత్తంగా రూ.17.2 కోట్లు తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది. తాము చెప్పే సలహాలు, సూచనలు కచ్చితమైనవని చెప్పడానికి అన్సారీ (Nasiruddin Ansari) పరిధులు దాటి వ్యవహరించారని స్పష్టం చేసింది. సామాన్యులను ప్రభావితం చేసేలా వీడియోలు చేస్తూ వారిని బలవంతంగా సెక్యూరిటీ మార్కెట్‌లోకి లాగే ప్రయత్నం చేశారని తెలిపింది. స్థూలంగా చూస్తే ఆయన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు నిర్ధారించింది.

ఇన్వెస్టర్లు ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సెబీ సూచించింది. సెబీ (SEBI) నమోదిత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడాలని హితవు పలికింది. ప్రస్తుతం తమ వద్ద 1,313 మంది రిజిస్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు ఉన్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని