Zepto: జెప్టో జాక్‌పాట్‌.. ₹1,653 కోట్ల నిధుల సమీకరణ

Zepto funding: ముంబయికి చెందిన స్టార్టప్‌ కంపెనీ జెప్టో జాక్‌పాట్‌ కొట్టింది. స్టెప్‌స్టోన్‌ గ్రూప్‌ సహా ఇతర ఇన్వెస్టర్ల నుంచి రూ.1600 కోట్ల మేర నిధులు సమీకరించింది.

Published : 25 Aug 2023 19:38 IST

దిల్లీ: ముంబయికి చెందిన ఆన్‌లైన్‌ గ్రాసరీ స్టార్టప్‌ జెప్టో (Zepto) జాక్‌పాట్‌ కొట్టింది. స్టెప్‌స్టోన్‌ గ్రూప్‌, ఇతర కంపెనీల ఇన్వెస్టర్ల నుంచి 200 మిలియన్‌ డాలర్లు (రూ.1653 కోట్లు) నిధులు సమీకరించింది. ఈ ఫండింగ్‌ ద్వారా ఈ ఏడాది యూనికార్న్‌ అవతరించిన తొలి స్టార్టప్‌గా జెప్టో నిలిచిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. స్టార్టప్‌ కంపెనీలకు కొన్ని నెలలుగా ఫండింగ్‌ నెమ్మదించిన వేళ.. జెప్టోకు ఈ నిధులు అందడం గమనార్హం.

ఫండింగ్‌ నేపథ్యంలో జెప్టో తన ఐపీఓ ప్రణాళికను బయటపెట్టింది. 2025 నాటికి ఐపీఓకు రావాలనుకుంటున్నట్లు జెప్టో వ్యవస్థాపకులు అదిత్ పలీచా, కైవల్య వోహ్రా పేర్కొన్నారు. రానున్న 12-15 నెలల్లో కంపెనీని లాభాల్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, అందుకోవాల్సింది చాలా ఉందని జెప్టో సీఈఓ అదిత్‌ పలీచా పేర్కొన్నారు. రాబోయే కొన్ని త్రైమాసికాల్లో 1 వార్షిక బిలియన్‌ డాలర్ల అమ్మకాలు సాధిస్తామని వోహ్రా పేర్కొన్నారు. ఈ ఫండింగ్‌ రౌండ్‌లో కాలిఫోర్నియాకు చెందిన గుడ్‌ వాటర్‌ కేపిటల్‌తో పాటు, స్టెప్‌స్టోన్‌ గ్రూప్‌ నిధులు అందించాయి. ఇప్పటికే నిధులు సమకూర్చిన నెక్సస్‌ వెంచర్‌ పార్టనర్స్‌, గ్లేడ్‌ బ్రూక్‌ క్యాపిటల్‌, ల్యాచీ గ్రూమ్‌ సైతం ఈ రౌండ్‌ ఫండింగ్‌లో పాల్గొన్నాయి.

Zepto: చిటికేసి... వేల కోట్లు సృష్టించిన చిన్నోళ్లు!

స్టాన్‌ఫర్డ్‌ చదువు వదిలేసి... 

బెంగళూరులో జన్మించిన కైవల్య దుబాయ్‌ కాలేజీలో చదివాడు. అదిత్‌ ముంబయిలో పుట్టి పెరిగాడు. దుబాయ్‌లో చదివాడు. అలా ఇద్దరూ కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చదవటానికి విశ్వవిఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ కాలేజీకి వెళ్లారు. చదువు మధ్యలోనే వదిలేసుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. కరోనా లాక్‌డౌన్‌ వేళ తట్టిన ఐడియా.. వారి జీవితాన్నే మలుపు తిప్పింది.  2020 కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ముంబయిలో అపార్ట్‌మెంట్లో ఉన్న వీరిద్దరూ.. చాలామంది సామాన్యుల మాదిరిగానే నిత్యావసర సరకులకు ఇబ్బంది పడ్డారు. తొలుత కైవల్య... కిరాణామార్ట్‌ పేరుతో ఈ స్టార్టప్‌ ఆరంభించాడు. తర్వాత అదిత్‌ చేరాడు. స్థానిక కిరాణా దుకాణాలతో ఒప్పందం కుదుర్చుకొని.. తక్షణమే ఇళ్లకు సామగ్రిని చేర వేయటం మొదలెట్టారు. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి తొలుత తమపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. ఆ అనుభవాలతో సరిదిద్దుకుంటూ వెళ్లారు. అలా జెప్టో రూపంలో 10 నిమిషాల్లోనే వస్తువులను ఇంటికి చేర్చే స్టార్టప్‌ను నెలకొల్పారు. కేవలం ఆరు నెలల్లోనే నిలదొక్కుకున్నారు. అంతేకాదు 2022 ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా సంపన్నుల జాబితాలోనూ ఈ ఇద్దరు కుర్రాళ్లు చోటు దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని