logo

సర్వేలతోనే సరిపెడుతున్నారు..

జిల్లాలోని 18 మండలాల్లోని 396 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కొన్ని పల్లెలు నేటికీ కరెంటు కష్టాలెదుర్కొంటున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో ఈ సమస్యలున్నాయి. అసలే కరెంటు లేనివి ఆరు ఉండగా, త్రీఫేజ్‌ సరఫరా లేని గ్రామాలు 42 ఉన్నాయి. ఆ ప

Published : 25 Jun 2022 04:24 IST

గిరి గ్రామాల్లో తొలగని విద్యుత్తు కష్టాలు

నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే

సర్వే నిర్వహిస్తున్న అటవీ, విద్యుత్తు శాఖ అధికారులు

జిల్లాలోని 18 మండలాల్లోని 396 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న కొన్ని పల్లెలు నేటికీ కరెంటు కష్టాలెదుర్కొంటున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో ఈ సమస్యలున్నాయి. అసలే కరెంటు లేనివి ఆరు ఉండగా, త్రీఫేజ్‌ సరఫరా లేని గ్రామాలు 42 ఉన్నాయి. ఆ పల్లెల్లో విద్యుత్తు వెలుగులు నింపాలని ప్రభుత్వం 2020 సంవత్సరంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో అటవీ ప్రాంతంలో లేని పది గ్రామాలకు త్రీఫేజ్‌ సరఫరాను పునరుద్ధరించారు. అయితే అడవి పరిధిలో గల పల్లెల సమస్య మాత్రం ఇప్పటికీ కొలిక్కిరాలేదు.

పలు దఫాలుగా..

సరఫరానే లేని గ్రామాలతోపాటు, త్రీఫేజ్‌ సమస్యను ఎదుర్కొంటున్న 32 పల్లెల పరిస్థితులపై ఇప్పటి వరకు పలు దఫాలుగా సర్వేలు చేశారు. అటవీ, విద్యుత్తు శాఖల ఆధ్వర్యంలో మొదటి సారి, ఆ తర్వాత డీజీపీఎస్‌ (డిజిటల్‌ గ్లోబల్‌ పొజిషిన్‌ సిస్టం) ద్వారా మరోసారి సర్వే చేపట్టారు. నివేదికలను రాష్ట్ర అటవీశాఖకు పంపించారు. ప్రారంభంలో ఇరువైపులా ఒక్కో స్తంభానికి, తీగలకు ఏడు మీటర్ల విస్తీర్ణం అవసరమని గుర్తించారు. అయితే కవ్వాల్‌ అభియారణ్యం ఉండడంతో వాటికి బదులుగా వణ్యప్రాణులకు హాని కలుగకుండా, విద్యుత్తు తీగలు సురక్షితంగా ఉండేలా, చెట్ల కొమ్మలు తగిలినా అంతరాయం ఏర్పడకుండా నూతన పద్ధతిలో తీసుకొచ్చిన ఇన్సులేటెడ్‌ తీగలు వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇరు వైపులా 2.4 మీటర్ల చొప్పున మొత్తం 38 గ్రామాలకు 77.855 కిలోమీటర్ల విస్తీర్ణంలో 18.684 హెక్టార్ల అటవీ ప్రాంతం అవసరమవుతుందని అంచనా వేశారు. రూ.8.56 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ, విద్యుత్తు శాఖ అధికారులు మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు.  అయితే ప్రస్తుతం వర్షాకాలం మొదలుకావడంతో ఈ సారి పనులు సాధ్యమేనా..? అన్న సందిగ్ధం నెలకొంది. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు అనుమతుల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుని సరఫరా అందించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.


పెంబి మండలం పోచంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోముగూడ గ్రామం ఇది. ఇక్కడ సుమారు 15 కుటుంబాలు 70కి పైగా జనాభా ఉంటారు. ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వారికి విద్యుత్తు సౌకర్యం లేదు. దీంతో రాత్రివేళల్లో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రీఫేజ్‌ సౌకర్యం లేక వర్షాధార పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.


కష్టాలు చెప్పలేనివి 

ఆత్రం అభిమాన్‌, సోముగూడ

కరెంటు లేక చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. రాత్రివేళల్లో దీపాలే మాకు ఆధారం. ఏళ్లు గడుస్తున్నా.. మా సమస్య మాత్రం తీరడం లేదు. ఈ విషయంపై అధికారులకు, నాయకులకు పలు మార్లు విన్నవించాం. మా ఇబ్బందులు గుర్తించి త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం.


ఉన్నతాధికారులకు నివేదించాం

- జయవంత్‌ చౌహాన్‌, ఎస్‌ఈ, విద్యుత్తు శాఖ, నిర్మల్‌

సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. సర్వే వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు పంపించాం. వారి సూచనల మేరకు ఇన్సులేటెడ్‌ తీగల ఏర్పాటు విషయంపై తగిన కార్యాచరణ రూపొందించాం. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని