logo

టమాట రైతుకు కటకట..

పత్తి, సోయా తర్వాత జిల్లాలో టమాట అధికంగా పండుతుంది. వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను రైతులు అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

Updated : 04 Dec 2022 06:31 IST

పరిశ్రమ ఏర్పాటు హామీలకే పరిమితం

న్యూస్‌టుడే, గుడిహత్నూర్‌, ఇచ్చోడ: పత్తి, సోయా తర్వాత జిల్లాలో టమాట అధికంగా పండుతుంది. వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను రైతులు అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. పండిన పంటను అమ్మడం రైతుకు కష్టంగా మారింది. ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నా దళారులు బాగుపడుతున్నారే తప్ప అన్నదాతలకు మిగిలింది శూన్యం. గతంలో అప్పటి ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుడిహత్నూర్‌ మండలంలో టమాట జూస్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు.  

గుడిహత్నూర్‌, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, ఉట్నూర్‌, మండల రైతులు 10 వేల ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు స్టెకింగ్‌ పద్ధతిని అనుసరిస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. మార్కెట్‌ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది అక్టోబరులో క్వింటాలుకు రూ.800పైగా ఉండగా, ఈ ఏడాది రూ.400 మాత్రమే ఉంది. పెట్టిన పెట్టుబడులు రావడం లేదని వాపోతున్నారు.

టమాట పంట

హామీ నెరవేరదేమి?

రాజీవ్‌ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గుడిహత్నూర్‌ మండలానికి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గుడిహత్నూర్‌లో టమాట ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేరలేదు. గుడిహత్నూర్‌ మండలంలో ఈ ఏడాది 1200 ఎకరాల్లో రైతులు టమాట వేశారు. ప్రతి రోజు గుడిహత్నూర్‌ నుంచి నిజామాబాద్‌, మధ్యప్రదేశ్‌, నాగ్‌పూర్‌, అకోలా, బలార్షా, చంద్రపూర్‌ మార్కెట్లకు 5 నుంచి 7 టన్నుల వరకు సరకు తరలిస్తున్నారు. పరిశ్రమ వస్తే ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని కోరుతున్నారు.


కొనేవారు లేరు
- శశికళబాయి, గుడిహత్నూర్‌, మహిళ రైతు

కొన్నేళ్లుగా ఇతర పంటలతో పాటు ఎకరం విస్తీర్ణంలో టమాటా పంట సాగు చేస్తున్నాం. ప్రస్తుతం కొనేవారు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. దళారులు రూ.200కు క్రేట్‌(డబ్బా) తీసుకెళుతున్నారు. పెట్టిన పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదు. టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.


పరిశ్రమతోనే రైతులకు న్యాయం
- జాదవ్‌ కాంతారావు, రైతు గుడిహత్నూర్‌

జిల్లాలో ఏటా టమాట సాగు పెరుగుతోంది. గుడిహత్నూర్‌ మండలంలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఇక్కడి పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే పరిస్థితి ఉంది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి గుడిహత్నూర్‌లో జూస్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా ఎలాంటి కదలిక లేదు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని