logo

సమస్యలెన్నో.. ఆశలు మీపైనే

జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌రాజ్‌ సరిచేయాల్సిన సమస్యలెన్నో ఉన్నాయి.

Published : 03 Feb 2023 04:48 IST

ఈటీవీ - ఆదిలాబాద్‌: జిల్లా కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌రాజ్‌ సరిచేయాల్సిన సమస్యలెన్నో ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా అహ్మద్‌బాబు, దివ్యదేవరాజన్‌ ఇక్కడ పాలనాధికారులుగా ప్రజల నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రైతులు, పేదల గోడు వినడం, క్షేత్రస్థాయిలో జరిగే అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా చూడటమే వారికి ప్రజల్లో మంచిపేరు తెచ్చిపెట్టింది. ఎన్నో సమస్యలున్న జిల్లాను ముందుకు నడిపించాల్సిన బృహత్తర బాధ్యత రాహుల్‌రాజ్‌పై ఉంది.
రిమ్స్‌ ఆసుపత్రిలో గోస : రిమ్స్‌ ఆసుపత్రిలో పొరుగు సేవల ఏజెన్సీల నిర్వాకం అంతా అక్రమాల తతంగంగా మారింది. ఇటీవల ఓ ఏజెన్సీ నిర్వాహకుడు 20 మంది ఒప్పంద కార్మికులను ఏకపక్షంగా తొలగిస్తే అధికారులు ప్రశ్నించకపోవడం వెనుక మామూళ్ల దందా నడిచిందనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్‌, జూనియర్‌ సహాయ ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, రిమ్స్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ తేజ అనిశాకు చిక్కడం కలకలం సృష్టించింది. వైద్యులను, వైద్య సిబ్బందిని, ఏజెన్సీలను సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అవినీతి ఉపాధి : జిల్లాలో ఉపాధి హామీ పథకం అవినీతి కుంపటిలా మారింది. అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఓ ఎంపీడీవోపై విచారణ పూర్తి కాకముందే మళ్లీ పోస్టింగ్‌ ఇవ్వడం, మరో మండలంలో రూ.12 లక్షలు కాజేసిన మరో ఎంపీడీవోకు ఆ శాఖలో పోస్టింగ్‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆ అధికారే అదే శాఖలో ప్రస్తుతం కీలకమైన పోస్టింగ్‌కు పావులు కదుపుతుండటం ప్రాధాన్యతాంశంగా మారింది.  

వ్యవసాయ మార్కెట్‌ : జిల్లాలో 5 వ్యవసాయ మార్కెట్లలో అన్నదాతలు మోసపోవడం నిత్యకృత్యంగా మారింది. పక్కనే మహారాష్ట్రలో తాజాగా పత్తి ధర రూ.8500పైన నమోదవుతుంటే, ఆదిలాబాద్‌ కేంద్రంగా వ్యాపారుల సిండికేట్‌ కారణంగా రూ.8 వేల లోపు ఉంటోంది. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ వ్యాపార కొనుగోళ్ల కోసం ముందుకొచ్చినా ప్రైవేటు వ్యాపారులతో అధికారులు కలిసిపోయారనే ఆరోపణ రైతుల నుంచి వినిపిస్తోంది. అదనపు పాలనాధికారుల నేతృత్వంలో ఎప్పటికప్పుడు చేయాల్సిన పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది.

స్థిరాస్తి దందా : ఆదిలాబాద్‌ సహా జిల్లాలోని బేల, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో స్థిరాస్తి వ్యాపారుల భూకబ్జాల పర్వం హద్దులు దాటింది. కొంతమంది అధికారుల ప్రోత్సాహంతో బినామీ పత్రాలు తయారు చేసి రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడం పరిపాటిగా మారింది. జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగమే గుర్తించిన 109 అక్రమ లేఅవుట్లకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యల్లేవు. ఏజెన్సీలోనూ 1/70 నిబంధనలకు భిన్నంగా కొంత మంది తహసీల్దార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న ఘటనలు కోకొల్లలు.

ప్రజా ఫిర్యాదుల విభాగమే ప్రామాణికం : కలెక్టర్‌ నేతృత్వంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల విభాగమే అధికారుల పనితీరుకు ప్రామాణికం. ఫిర్యాదుల విభాగం ప్రారంభం కాగానేే అరగంట పాత అర్జీలపై సమీక్ష ఉండేది. పాత వాటిలో పరిష్కారమైనవి ఎన్ని? కాని వాటి కారణాలేంటనే దానిపై చర్చ జరిగేది. కొంతకాలంగా ఆ విధానం ఆగిపోయింది. మండలస్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో న్యాయం జరగక ఫిర్యాదుల విభాగానికి వచ్చే బాధితులను కలెక్టర్‌ అందుబాటులో లేకపోతే పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని