logo

పోషకాహారం..చిన్నారులకు ఆరోగ్యం

చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. వారిలో ఎదుగుదల లోపాలు లేకుండా పలు పథకాలను అందిస్తున్నాయి.

Published : 23 Mar 2023 06:14 IST

 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు

ఏసీసీ, న్యూస్‌టుడే

ఏసీసీ అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారం తయారీపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న నిర్వాహకులు

చిన్నారుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. వారిలో ఎదుగుదల లోపాలు లేకుండా పలు పథకాలను అందిస్తున్నాయి. పోషణ లోపాలు లేకుండా కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తోంది. చిన్నారుల సంక్షేమానికి రూ.కోట్ల నిధులు ఖర్చుచేస్తున్నా క్షేత్రస్థాయిలో లోపాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోషణ్‌ అభియాన్‌ పేరిట ప్రభుత్వం పోషణ సంబరాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 20 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలల భాగస్వామ్యంతో చైతన్యం తీసుకొచ్చేలా 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

చిరుధాన్యాలతో ప్రయోజనం..

చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు సైతం వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటి ప్రయోజనాలు, వినియోగంపై మరింత చైతన్యం తీసుకొచ్చేలా పోషణ పక్షోత్సవాల్లో సదరు అంశానికి ప్రాధాన్యమిచ్చారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

నిరంతర అవగాహన

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం. డబ్బా పాలు పట్టడం ద్వారా చిన్నారుల ఎదుగుదల లోపిస్తుంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనిపై ఏటా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వారోత్సవాలతో సరిపెట్టకుండా తల్లిపాలు, పౌష్టికాహారం ప్రాధాన్యంపై నిరంతరం అవగాహన కల్పిస్తేనే సత్ఫలితాలు అందే అవకాశముంటుంది. దీంతో కేంద్రాలకు సరఫరా అయ్యే పాలు, గుడ్లు, ఇతర పౌష్టికాహారం సక్రమంగా సరఫరా అయ్యేలా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.


సజావుగా జరిగేలా..
- చిన్నయ్య, జిల్లా సంక్షేమశాఖాధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు పోషణ పక్షోత్సవాల నిర్వహణపై ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచనలు చేశాం. అన్ని కేంద్రాల్లో షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు చేపడతాం. పక్షోత్సవాలు సజావుగా జరిగేలా చూస్తాం. పోషణ లోపంతో బాధపడే చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. కేంద్రాలకు సరకుల సరఫరాపై తగిన చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని