logo

బహుజన, తెలంగాణవాదాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి

రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

Published : 29 Mar 2024 05:46 IST

భారాస నేత ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నలను సన్మానిస్తున్న కార్యకర్తలు

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగాన్ని కాపాడాలనే సంకల్పం, బహుజన, తెలంగాణ వాదం ఒక్కటేననే ఉద్దేశంతో తాను భారాసతో చేతులు కలిపినట్లు ఆ పార్టీ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం కాగజ్‌నగర్‌లోని ఓ పంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సిర్పూరు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయగా, 44వేల ఓట్లు వేసిన వారికి, అభిమానులు, శ్రేయోభిలాషులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తాను పార్టీ మారితే మాజీ ఎమ్మెల్యే కోనప్పకు మింగుడు పడటం లేదని విమర్శించారు. భారాసలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసిన కోనప్ప కేవలం అధికార దాహం కోసమే పార్టీ ఫిరాయించినట్లు ఆరోపించారు. బహుజన, తెలంగాణ వాదం నిలబడాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ రెండు దోపిడీ పార్టీలేనని, వచ్చే ఎన్నికల్లో పట్టుమని మూడు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ.. భారాస ప్రభుత్వ హయాంలోనే సిర్పూరు, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని కూడా సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. గతంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మళ్లీ భారాసను ఆదరించాలని కోరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల, ప్రజలకు అందుబాటులో మెరుగైన పాలన అందించాలనే ఉద్దేశంతో జిల్లాలను ఏర్పాటు చేసిన ఘనత భారాసకే దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్‌ మాట్లాడుతూ.. నాయకులు పార్టీలు ఫిరాయించినా భారాసకు పెద్దగా నష్టమేమీ లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయన్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ నుంచి పలువురు భారాసలో చేరగా.. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బెజ్జూరు జడ్పీటీసీ సభ్యురాలు పుష్పలత, జడ్పీటీసీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు మోయిన్‌, రాజ్‌కుమార్‌, నక్క శంకర్‌, లెండుగురు శ్యాంరావు, సోయం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని