logo

Kodali Nani: గాలి మేడలు... ప్రగతి బీటలు

ఇదీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు) నివాసానికి వెళ్లే రహదారి. అంతా గుంతలమయం. నిత్యం ఎమ్మెల్యే ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ రహదారిని మాత్రం నిర్మించాలని పురపాలక సంఘం అధికారులను అడగలేరు.

Updated : 12 Aug 2023 10:41 IST

గుడివాడ అభివృద్ధి పట్టని ఎమ్మెల్యే నాని
నాలుగేళ్లుగా పైకం విదల్చని రాష్ట్రం
కేంద్రం నిధులు, ప్రజల పన్నులే ఆసరా

నిత్యం ఎమ్మెల్యే నాని ఇంటికి వెళ్లే దక్షిణం రోడ్డు

ఈ రహదారి చూశారా...

ఇదీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (శ్రీవెంకటేశ్వరరావు) నివాసానికి వెళ్లే రహదారి. అంతా గుంతలమయం. నిత్యం ఎమ్మెల్యే ఈ మార్గంలోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ రహదారిని మాత్రం నిర్మించాలని పురపాలక సంఘం అధికారులను అడగలేరు. ఎందుకంటే పురపాలక సంఘం వద్ద ఖజానా ఖాళీ. ఈ ఒక్క రోడ్డు మాత్రమే కాదు. గుడివాడ పట్టణంలో ఏ రహదారి చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు గుంతలమయం. రోడ్డుపైనే డ్రెనేజీ నీరు పారడం.. పారిశుద్ధ్య లేమి.. ఇరుకు రహదారులు. ప్రజలపై పన్ను భారం వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నా అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉంది. దోమల స్వైర విహారం, పందుల సంచారం.. రోగాలతో ప్రజల సహజీవనం.. ఇదీ గుడివాడ పట్టణం పరిస్థితి.

ఇటీవల కురిసిన వర్షాలకు మునిగిన గుడివాడ బస్టాండు రోడ్డు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, గుడివాడ (నెహ్రూచౌక్‌)

గుడివాడ పట్టణానికి ఎంతో చరిత్ర ఉంది. 1927లోనే ఇది పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. దాదాపు వందేళ్ల చరిత్రకు దగ్గర అవుతోంది. అలాంటి గుడివాడ పట్టణం.. అభివృద్ధి లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొంది.. ఒకసారి మంత్రిగా పనిచేసిన కొడాలినాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో నిధులు అందకపోవడం గమనార్హం. కేంద్రం విడుదల చేసే గ్రాంట్లతో కాస్తాకూస్తో నడిపిస్తున్నారు. పట్టణ శివారులో వేల టన్నుల చెత్త పేరుకుపోయినా తొలగించే నాథుడే లేరు. రోడ్లకు ఇరువైపులా డ్రెనేజీలు శుభ్రం చేయక నెలలు గడుస్తున్నాయి. చిన్నపాటి వర్షం వస్తే రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఎప్పుడో తెదేపా ప్రభుత్వ హయాంలో వేసిన రహదారులకు ఇప్పటికీ మరమ్మతులకు మోక్షం కలగడం లేదు. ప్రధాన ర.భ శాఖ పరిధిలోని రహదారులే అంతంత మాత్రంగా ఉన్నాయి. పురపాలక సంఘానికి చెందిన రహదారులు, కాలనీ రహదారులు దారుణంగా ఉన్నాయి. గుంతల మధ్య వాహనాలు నడపడం అలా ఉంచితే నడిచే పరిస్థితి లేదని పాదచారులు వాపోతున్నారు.

ఏవీ గ్రాంట్లు...

కొడాలి నాని మంత్రిగా పనిచేసినా గుడివాడ పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, అమృత్‌ గ్రాంటు, రుణం తప్ప రాష్ట్రం నుంచి ఇతర నిధులు రాలేదు. ఎస్సీ ఎస్‌పీ గ్రాంటు కింద ఒకే సంవత్సరం (2021-22)   రూ.1.03 కోట్లు వచ్చాయి. 14, 15వ ఆర్థిక సంఘం కింద రూ.2.46 కోట్లు, 8.07 కోట్లు, రూ.9.61 కోట్లు, 10.23 కోట్లు, 4.38 కోట్లు అందాయి. అభివృద్ధి కేంద్రం నిధులతోనూ, పురపాలక సంఘం సొంత నిధులతోనే చేపట్టారు. కానీ ప్రభుత్వం నుంచి మౌలిక వసతులకు మున్సిపాలిటీకి ఒక్క రూపాయి విదల్చలేదు. మున్సిపాల్టీ సాధారణ నిధులు గత అయిదేళ్లుగా రూ.1.35కోట్లు, రూ.2.85కోట్లు, రూ.1.23కోట్లు, రూ.1.75కోట్లు, రూ.1.37కోట్లు అభివృధ్ధి పనుల కోసం వెచ్చించారు.

కనిపించని మౌలిక వసతులు...

గుడివాడ పట్టణం విస్తరించింది. శివారు పంచాయతీల విలీనం, వార్డుల విభజనలో తేడా రావడంతో గత పురపాలక సంఘం ఎన్నికలు నిర్వహించలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,18,167 మంది ఉన్నారు. 2021 ప్రకారం 1.53లక్షలకు చేరుకున్నారు. అమృత్‌ పథకం కింద మంచి నీటి ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి నిధులు అందినా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. ముబారక్‌ సెంటర్‌, చేపల మార్కెట్‌, బంటుమిల్లి రోడ్డు వద్ద ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని పూర్తి అయినా ప్రారంభించలేదు. ఇటీవల ఒక ట్యాంకులో పడి బాలుడు మృతి చెందాడు.
వందేళ్ల చరిత్ర ఉన్న గుడివాడ పట్టణంలో మున్సిపల్‌ అధికారులు ఇంకా ట్యాంకర్లతోనే మంచి నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉంది.

పన్నుల భారం సరేసరి...

మరోవైపు పన్నుల భారం భారీగా మోపుతున్నారు. చెత్త సేకరణకు సైతం యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 2018-19లో రెవెన్యూ పన్నులు రూ.6.07కోట్లు ఉంటే.. 2022-23లో వసూలు రూ.8.41కోట్లకు చేరింది. నాలుగేళ్లలో దాదాపు రూ.2.30కోట్లు పన్నుల భారం పెరిగింది. ఇతర పన్నులు కూడా అదే స్థాయిలో పెరిగినా మౌలిక వసతులు మాత్రం పెరగలేదని ప్రజలు వాపోతున్నారు.

పారిశుద్ధ్యం దారుణం...

శివారులో చెత్త పేరుకుపోయింది. దాదాపు 50వేల టన్నుల నుంచి లక్ష టన్నుల చెత్త ఉంటుంది. దీన్ని తరలిస్తామని ఈ ఏడాది మే నెలలో ఎమ్మెల్యే పరిశీలించి హామీ ఇచ్చారు. ఇప్పటికీ అదే తరహాలో కొండలా పేరుకుపోయింది. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండిపోయింది. సుందరీకరణ గాలికి వదిలేశారు. చెత్త సేకరణ నామమాత్రంగానే జరుగుతోంది. అన్నింటికీ ప్రజల నుంచి వసూలు చేసిన సాధారణ నిధులే కావాల్సి వస్తోంది. వీధిలైట్లు దారుణంగా ఉన్నాయి. ప్రధాన రహదారి మినహా వీధుల్లో లైట్లు లేవు. వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నియంత్రణ లేదు. పందులు విచ్చల విడిగా తిరుగుతున్నా కట్టడి లేదు. జ్వరాల బారిన పడుతున్నామని జనం వాపోతున్నారు. వర్షాకాలం వస్తే అంతా అస్తవ్యస్తంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని