logo

రోగుల సహాయకులతో అసభ్య ప్రవర్తన.. కీచక వైద్యుడిపై కేసు

శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా రోగికి తోడుగా వచ్చిన సోదరిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన కీచక వైద్యుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.

Updated : 06 Mar 2024 09:05 IST

డాక్టర్‌ తలారి సీతారాం

విస్సన్నపేట, న్యూస్‌టుడే: శస్త్రచికిత్స చేయించుకున్న మహిళా రోగికి తోడుగా వచ్చిన సోదరిని లైంగికంగా వేధింపులకు గురిచేసిన కీచక వైద్యుడిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్‌ ఆరోగ్య శాఖ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ తలారి సీతారాం, స్థానిక వెంకటేశ్వర థియేటర్‌ సమీపంలో కీర్తన ప్రసూతి, జనరల్‌ ఆస్పత్రి నడుపుతున్నారు. కడుపులో ఉన్న గడ్డ తొలగించడానికి అవసరమైన శస్త్రచికిత్స నిమిత్తం ఓ గ్రామానికి చెందిన మహిళ 2న ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స తర్వాత తన అక్కకు సపర్యలు చేసేందుకు వచ్చిన చెల్లెలుపై డాక్టర్‌ సీతారాం కన్నేశారు. రోగి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాలంటూ సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆమెను డాక్టర్‌ తన ఛాంబర్‌కు పిలిచారు. లోపలికి వెళ్లిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించారు. అతడి బారి నుంచి అతి కష్టంపై బయటపడిన ఆమె జరిగిన విషయాన్ని తన భర్తకు ఫోన్‌ చేసి చెప్పగా వెంటనే ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా డాక్టర్‌ ఆమె చరవాణి నంబరుకు ఫోన్‌ చేయడం, వాట్సాప్‌నకు మెసేజ్‌ పంపారు. వైద్యుడి తీరు నచ్చక రోగిని మంగళవారం ఉదయం వేరే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. గతంలోనూ డాక్టర్‌ పలువురు మహిళలతో ఇదే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు డాక్టర్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కొందరు రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి రాజీ దిశగా ఒత్తిడి చేయడంతో, బాధిత మహిళ పోలీసు టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి, కీచక వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కీర్తన ఆస్పత్రి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని