logo

అంతా అన్నారు.. కొంతే కొన్నారు!

దివిసీమలో ఖరీఫ్‌ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు.

Published : 29 Mar 2024 04:19 IST

ధాన్యం సేకరణ ఆపేసిన ప్రభుత్వం
ఇక... ప్రైవేటు వ్యాపారులే దిక్కు
ఈనాడు - అమరావతి

పామర్రు: కొండిపర్రు వద్ద నూర్పిడి చేయని వరి కుప్పలు

దివిసీమలో ఖరీఫ్‌ ఆలస్యంగా సాగు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోతలు కోస్తున్నారు. నూర్పిళ్లు చేస్తున్నారు. దివిసీమ పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలు ఉంది. కోతలు పూర్తి కావాలంటే కనీసం నెల పడుతుందనేది రైతుల మాట. ధాన్యం ఎవరికి అమ్మాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ అధికారికంగా ఆపేశారు. ఇప్పటికే చాలా వరకు సేకరణ కేంద్రాలను మూసేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో మార్చి 1 నుంచే కొనుగోళ్లు ఆపేయగా.. కృష్ణా జిల్లా ఏప్రిల్‌ 1 నుంచి ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా నూర్పిళ్లు కాని ప్రాంతాలు చాలా ఉన్నాయి. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు దిగుబడిపై కాకి లెక్కలు వేసి ధాన్యం సేకరణ లక్ష్యాలను కుదించారు. మిగులు ధాన్యం మాటేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ధర తక్కువకు..!

ఈ ఏడాది బయట వ్యాపారులకు ధాన్యం తక్కువ ధరకు రైతులు విక్రయించారు. తెలంగాణ వ్యాపారులు చాలా వరకు కొన్నారు. ధాన్యం మిల్లు ఆడిస్తే.. కేవలం 60 శాతమే బియ్యం వస్తున్నాయి. కిలో బియ్యం రూ.38 వరకు ఖర్చు అవుతుంది. అంటే కనీసం రూ.40కు అమ్మాలి. అంత ధర పలకడం లేదు. కృష్ణా జిల్లా నుంచి దాదాపు 1.50 లక్షల టన్నులు బయటి వ్యాపారులు కొన్నారు. ప్రభుత్వానికి విక్రయిస్తే.. ధాన్యం డబ్బులు రావడం లేదని కొందరు రైతులు బయట వ్యాపారులకు అమ్మారు. దాదాపు రెండు మూడు నెలలు తర్వాత సొమ్ములు ఖాతాలో పడుతున్నాయి. ఈ రెండు నెలల వడ్డీ భారం రూ.లక్షల్లోమాటే.

రబీ పరిస్థితేంటి?..

రెండు జిల్లాల్లోనూ రబీ పంట సాగు లేదనేది వ్యవసాయ శాఖ మాట. డెల్టా కింద సాగునీరు ఇవ్వకుండా క్రాప్‌ హాలిడే ప్రకటించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్‌ఎస్‌పీ కాలువ కింద నీరు రాలేదు. కానీ పలు మండలాల్లో బోర్ల కింద వరి వేశారు. రెండు జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలు వరి సాగులో ఉంది. బావులు, బోర్ల కింద సాగు చేసిన వరి మాత్రమే. దీనికి కొనుగోలు కేంద్రాలు పెట్టకపోగా.. ఉన్నవీ మూసేయడంతో.. ఇక మిల్లర్లే దిక్కు.

కృష్ణా జిల్లాలో...

కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ లెక్క మేరకు 4.50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగు చేశారు. ఎకరానికి 40-45 బస్తాల చొప్పున.. 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. కానీ ఇప్పటికి 5 లక్షల టన్నులు కూడా కొనలేదు. ఆర్బీకేల్లో సాంకేతిక ఇబ్బందులు.. ఈ-క్రాప్‌, తేమ, రవాణా సమస్యలతో రైతులు చాలా వరకు బయట వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇంకా 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాల్లో ఇప్పుడు వరి నూర్పిళ్లు జరుగుతున్నాయి. జిల్లాలో 150 మిల్లులకు కేటాయించారు. వీటిలో సీఎంఆర్‌ అయిపోయిందని ఆపేయగా.. కొన్ని మిల్లులకు ఈ వారంలో ఆపనున్నారు. ఈ ఏడాది సీఎంఆర్‌ బియ్యంతో నష్టపోయామని మిల్లుల యజమానులు వాపోతున్నారు. పూర్తి స్థాయిలో ఇవ్వలేదని అంటున్నారు. గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు పరిధిలో మినుము వేయడంతో ఇంకా కుప్పలు నూర్పలేదు. మినుము చేతికి వచ్చాక నూర్పుతారు.

ఎన్టీఆర్‌లో..

ఎన్టీఆర్‌ పరిధిలో వ్యవసాయ శాఖ లెక్క మేరకు.. వరి సాగు విస్తీర్ణం 1.25 లక్షల ఎకరాలుగా చూపినా.. ఇంతకంటే ఎక్కువే సాగైంది. ఇక్కడా 45 బస్తాల దిగుబడి చొప్పున 2.50 లక్షల టన్నుల ధాన్యం కావాలి. లక్ష్యం మాత్రం 1.03 లక్షల టన్నులే. ఇది పూర్తయింది. అధికారులు 30-35 బస్తాల దిగుబడి అంచనా వేసినా.. ఈ దఫా పెరిగింది.

‘రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజా కొంటాం. తడిసిన, రంగు మారిన ధాన్యమూ కొంటాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పని లేదు..!’

అధికారులు, ప్రజాప్రతినిధుల స్పష్టీకరణ


‘ఏప్రిల్‌ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం. కుప్పలు నూర్పకుండా మిగిలిన రైతులుంటే ఈ రెండు రోజుల్లో ధాన్యం కేంద్రాలకు తేవాలి. మార్చి 31 వరకే ఉంటాయి..!’

కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌ గీతాంజలి శర్మ


పామర్రు నియోజకవర్గం కొమరోలు రైతు వల్లభనేని ప్రసాద్‌ 20 ఎకరాలు కౌలుకు చేశారు. రెండో పంటగా మినుము వేయడంతో వరి కోసి కుప్పలు వేశారు. ఇంకా నూర్పలేదు. ప్రస్తుతం నూర్పిడి చేసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తేవాలంటే వారం, పది రోజులు పడుతుంది. కానీ మూడు రోజులు దాటితే ధాన్యం కొనమని చెబుతుండటంతో ఇక ప్రైవేటు వ్యాపారులే దిక్కని ఆయన వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని