logo

AP News: సచివాలయ వాట్సాప్‌ గ్రూపుల్లో విష ప్రచారం

సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారంలో ఆరితేరిన అధికార వైకాపా.. ఎన్నికల వేళా ఇదే ఎత్తుగడ అనుసరిస్తోంది. ఇందుకు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే వాట్సాప్‌ గ్రూప్‌లను వేదికగా చేసుకుంది.

Updated : 30 Mar 2024 07:16 IST

నిత్యం సీఎం జగన్‌ వీడియోలు, ఫొటోల వెల్లువ
కోడ్‌ ఉల్లంఘించి విచ్చలవిడిగా వైకాపా పోస్టులు

సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారంలో ఆరితేరిన అధికార వైకాపా.. ఎన్నికల వేళా ఇదే ఎత్తుగడ అనుసరిస్తోంది. ఇందుకు ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసే వాట్సాప్‌ గ్రూప్‌లను వేదికగా చేసుకుంది. కోడ్‌ అమలులోకి వచ్చినా ఇప్పటికీ కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో సచివాలయ గ్రూప్‌ల్లో నిత్యం విషప్రచారం సాగుతోంది. సీఎం జగన్‌ను ఆకాశానికి ఎత్తుతూ వీడియోలు, ఫొటోలు పెడుతున్నారు. ఎన్నికల నియమావళి తుంగలో తొక్కి.. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైకాపా సోషల్‌ మీడియా విభాగం బరి తెగించి నిర్లజ్జగా ఎన్నికల ప్రచారం చేస్తున్నా అడ్డుకునే వారే లేకపోయారు.

ప్రభుత్వ కొత్త పథకాలు, విధానాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి వార్డు సచివాలయం స్థాయిలో ‘మన సచివాలయం’ పేరుతో గత రెండేళ్ల నుంచి వాట్సాప్‌ల్లో గ్రూప్‌లు నడుస్తున్నాయి. వీటిలో ఆ సచివాలయం పరిధిలోకి వచ్చే వాలంటీర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, ప్రజలు, లబ్ధిదారులు సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు ఐప్యాక్‌కు చెందిన ఒకరు, వైకాపా సోషల్‌ మీడియాకు చెందిన ప్రతినిధి ఇందులో సభ్యులుగా చేరారు. ఈనెల 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించగానే కోడ్‌ అమల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ మాధ్యమాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమే. కోడ్‌ వచ్చినప్పటి నుంచి దీనిని పట్టించుకోకుండా ప్రజల్లో విషబీజాలు నాటుతోంది వైకాపా మూక. సామాజిక మాధ్యమాల ద్వారా వీలైనంత ఎక్కువ మందిని చేరేందుకు నిబంధనలను తుంగలోకి తొక్కి ఎన్నికల ప్రచారాన్ని  వైకాపా కలుషితం చేస్తోంది. రెండు జిల్లాల్లో చాలా సచివాలయాల పరిధిలో ఆయా వాట్సాప్‌ గ్రూపుల్లో ఇదే రీతిలో వైకాపా అనుకూల పోస్టింగులను పెడుతున్నారు.

జగన్‌ భజనలో..

వైకాపా సోషల్‌ మీడియా విభాగం రూపొందించిన లఘు చిత్రాలు, జగన్‌ ప్రచార సభలు, ఫొటోలు, వీడియోలను వాట్సాప్‌ గ్రూప్‌ల్లో ఉంచుతున్నారు. తెదేపా, జనసేన, భాజపాలకు వ్యతిరేకంగా తయారు చేసిన పోస్టర్లు, నినాదాలను పోస్టు చేస్తున్నారు. మచ్చుకు.. మంత్రి జోగి పోటీ చేస్తున్న పెనమలూరు పరిధిలో ‘మన తాడిగడప-1 సచివాలయం’ వాట్సాప్‌ గ్రూప్‌ పరిశీలిస్తే.. ఈ వ్యవహారం బయటపడుతుంది. ఈనెల 20న.. ‘వాలంటీర్లపై తెదేపా దాష్టీకం’ పేరుతో ఓ పోస్టు పెట్టారు. ఇందులో సాక్షి టీవీలో ప్రసారమైన క్లిప్పింగ్‌ ఉంచారు. వాలంటీర్లు గౌరవ వేతనం తీసుకుని, సేవాభావంతో పనిచేస్తున్నారనీ.. ప్రజల సానుభూతి పొందే రీతిలో పోస్టు పెట్టారు. వాలంటీర్లు ప్రచారాల్లో పాల్గొనవద్దని స్పష్టంగా ఎన్నికల సంఘం చెప్పింది. దీంతోపాటు నిబంధనలు అతిక్రమించి ప్రచారంలో పాల్గొంటున్న వారిపై వేటు వేస్తోంది. దీనిని గాలికొదిలేసి.. వాలంటీర్లు కనిపిస్తే చావబాదాలని తెదేపా పిలుపు ఇచ్చిందనీ, కక్ష రాజకీయాలకు తెగిస్తున్నారని విషప్రచారం చేస్తున్నారు. ఇలా కుప్పలుతెప్పలుగా విష పోస్టులు పెడుతున్నారు.

పట్టించుకోని అధికారులు..

ప్రజలు, లబ్ధిదారులు సభ్యులుగా ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌ల్లో వైకాపా అనుకూల ప్రచారం నిషేధం. మాది అధికార పార్టీ.. నిబంధనలు మాకు పట్టవనే రీతిలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తోంది. ఇలాంటి వాటిపై నిఘా పెట్టి, నిలువరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ గ్రూపుల్లో సచివాలయ కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉన్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చాక అధికార, ప్రతిపక్ష పార్టీలు తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలి. దీనికి అధికారులు తిలోదకాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.


బరితెగించారు..

ఈ నెల 27.. నుంచి సీఎం జగన్‌.. ఇడుపులపాయ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలి విడత బస్సు యాత్ర ప్రారంభించారు. దీనిపై టీజర్‌ విడుదల చేశారు. ‘మేమంతా సిద్ధం యాత్రతో బెంబేలెత్తిపోతున్న పచ్చమంద’ అని సచివాలయ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేసింది వైకాపా సోషల్‌ మీడియా బృందం.

28న.. బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సాగింది. అక్కడి యాత్ర వీడియోలు, వైకాపా స్టార్‌ క్యాంపెయినర్‌ పేరుతో లబ్ధిదారుల అభిప్రాయాలు ఉంచారు.

29న.. బస్సు యాత్ర మూడో రోజు ఎమ్మిగనూరు, కోడుమూరుల్లో సాగిన తీరుపై పెద్దఎత్తున వీడియోలు, చిత్రాలను సోషల్‌ మీడియా బృందం ఉంచింది.

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని