logo

త్వరపడాలి.. బ్రో..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు వ్యూహ ప్రతివ్యూహాల రూపకల్పనలో ఉన్నారు.

Published : 30 Mar 2024 05:20 IST

ఇక మిగిలింది... జనసేన అభ్యర్థుల ఖరారే
బందరు లోక్‌సభ, అవనిగడ్డ అసెంబ్లీపై ఉత్కంఠ

ఈనాడు, అమరావతి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్థానాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవరో తేలిపోయింది. ఈ మేరకు వ్యూహ ప్రతివ్యూహాల రూపకల్పనలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో జనసేనకు కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారులో జాప్యం జరుగుతోంది. మచిలీపట్నం లోక్‌సభ స్థానం, అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లకు, రెండు లోక్‌సభ స్థానాలకు వైకాపా అభ్యర్థులను వెల్లడించింది. వీరంతా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఒక లోక్‌సభ, 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు తెదేపా అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా.. విజయవాడ పశ్చిమ నుంచి భాజపా పోటీచేయనుంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించి సంచలనం సృష్టించింది. త్వరలో భాజపా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ఇక జిల్లాలో మిగిలింది కూటమిలో జనసేనకు కేటాయించిన సీట్లు మచిలీపట్నం లోక్‌సభ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలు మాత్రమే.
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడిగా రంగంలోకి దిగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో తెదేపాకు గట్టి పట్టు ఉంది. తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సొంత జిల్లా కావడం విశేషం. ఆయన గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ నేపథ్యంలోనే కూటమిలో జనసేనకు ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ సీటు కేటాయించారు. భాజపాకు ఒక స్థానం కేటాయించారు. పూర్వ ఉమ్మడి జిల్లా పరిధిలో కైకలూరు స్థానాన్ని భాజపాకు కేటాయించారు. జిల్లాలో ప్రధాన పోటీ కూటమి అభ్యర్థులకు, అధికార పక్షం వైకాపా అభ్యర్థులకు మధ్య ఉంటుంది. కూటమిలో జనసేన మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. వామపక్షాలు కొన్ని స్థానాల్లో పోటీకి దిగే అవకాశం ఉంది. ప్రధానంగా విజయవాడ మధ్య నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు పోటీ చేయనున్నారు.

బందరు ప్రధాన రహదారి


కూటమిలో తర్జనభర్జన

మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి సిటింగ్‌ ఎంపీ బాలశౌరి కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆయన 2019లో వైకాపా నుంచి విజయం సాధించి ఇటీవల జనసేనలో చేరారు. అయితే ఆయనకు దాదాపు సీటు ఖరారనే ప్రచారం జరిగింది. కానీ ప్రకటనలో జాప్యం జరుగుతోంది. ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వేళ ప్రత్యామ్నాయం పరిశీలిస్తే.. బాలశౌరిని అసెంబ్లీకి పంపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పార్లమెంటుకు ఎవరు పోటీ చేస్తారనే దానిపై అటు జనసైనికులు, మిత్రపక్షాల కార్యకర్తలు, అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఆప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాలపైనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అవనిగడ్డకు మొదటి నుంచి బండ్రెడ్డి రామకృష్ణ పేరు పరిశీలనకు వచ్చింది. తర్వాత పలువురు ఆశించారు. నాగాయలంకకు చెందిన ఒక ఎన్నారై పేరు ప్రముఖంగా ప్రచారం జరిగింది. ఈ స్థానం తెదేపా సీనియర్‌ నేత మండలి బుద్ధప్రసాద్‌ ఇలాకా కావడం విశేషం. పొత్తులో భాగంగా జనసేనకు ప్రకటించినా.. ఆయన తేలిగ్గా తీసుకున్నారు. పొత్తు ధర్మం పాటిస్తామని ప్రకటించారు. కానీ అభ్యర్థిపైనే ఉత్కంఠ నెలకొంది.


ప్రత్యర్థులు సిద్ధం..

కూటమి తరఫున పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ముందుగానే ప్రత్యర్థులు ఎవరో స్పష్టమైంది. ముందు బందరు పార్లమెంటు స్థానానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ పేరు ప్రకటించారు. అవనిగడ్డ నియోజకవర్గానికి వైకాపా అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్‌ను ఎంపిక చేశారు. ఆయన అంతగా ఇష్టపడలేదు. తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని కోరారు. తర్జన భర్జనల తర్వాత తిరిగి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ను బందరు పార్లమెంటుకు, ఎమ్మెల్యేను తిరిగి అవనిగడ్డకు మార్చారు. ఇటీవల ర్యాలీతో చంద్రశేఖర్‌ మొదటిసారిగా బందరు వచ్చారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ(తెదేపా) తనయుడిగా ప్రముఖ డాక్టర్‌గా గుర్తింపు ఉన్నా... ప్రజలకు మాత్రం పరిచయం లేదు. రాజకీయాలపట్ల అంతగా ఆసక్తి లేదు. ఆయనకు పోటీగా జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనసేనకు పట్టు ఉన్న అవనిగడ్డలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని