logo

ఆరోగ్యశ్రీ అందక కుటుంబం అప్పులపాలు

నా కుమారుడికి అన్యాయం చేసి.. మా కుటుంబాన్ని అప్పుల పాలు చేశారని ఓ విద్యార్థి తండ్రి గుడివాడలో సోమవారం నిర్వహించిన సిద్ధం సభలో ఆవేదన వెళ్లగక్కాడు.

Updated : 16 Apr 2024 07:34 IST

సీఎం సారూ నా కుమారుడికి న్యాయం చేయండి: ఓ తండ్రి ఆవేదన

తన బిడ్డను ఆదుకోమని నినదిస్తున్న హుస్సేన్‌

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: నా కుమారుడికి అన్యాయం చేసి.. మా కుటుంబాన్ని అప్పుల పాలు చేశారని ఓ విద్యార్థి తండ్రి గుడివాడలో సోమవారం నిర్వహించిన సిద్ధం సభలో ఆవేదన వెళ్లగక్కాడు. తన కుమారుడ్ని ఉన్నత విద్యకు నోచుకోకుండా చేశారని.. తక్షణం న్యాయం చేయాలని ఆధారాలతో కూడిన పత్రాలతో వచ్చి సభలో బిగ్గరగా గోల చేసినా కనీస స్పందన లేకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే..  గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర గ్రామానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ కుమారుడు హతావుల్లా  తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా సాయం అందిస్తుందని కుమారుడ్ని కాపాడుకోవడానికి చాలా ఖర్చు చేసి శస్త్రచికిత్స చేయించి బాగు చేయించారు. ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసినా పైసా విడుదల కాలేదు. కుమారుడి శస్త్ర చికిత్స కోసం ఉన్న ఇల్లు, ఇంట్లోని బంగారం మొత్తం అమ్ముకోవాల్సి వచ్చింది. వాటితోపాటు రూ.7 లక్షలు అప్పుల పాలయ్యానని లబోదిబోమన్నారు. అయినా ప్రభుత్వం నేటికీ చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆవేదన వెళ్లగక్కారు. పైగా తన కుమారుడికి ఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు వచ్చినా చదివించే స్థోమత లేక మధ్యలో ఆపేయాల్సి వచ్చిందని.. న్యాయం చేయాలంటూ సీఎం సభలో మొదటి బారికేడ్ల వద్ద బిగ్గరగా కేకలు వేశారు. వెంటనే పోలీసులు స్పందించి హుస్సేన్‌ను స్టేజి వద్దకు తీసుకెళ్లారు. కానీ అతడ్ని వేదికపైకి అనుమతించలేదు. దీంతో అదే ఆవేదనతో నిస్సహాయస్థితిలో వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని