logo

మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైను ఐదేళ్లలో పూర్తి

దివిసీమ వాసులు దశాబ్దాలుగా కోరుతున్న.. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్‌ను తాము గెలిచిన తర్వాత ఐదేళ్లలోనే పూర్తిచేస్తామని జనసేన, తెదేపా, భాజపా కూటమి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు.

Published : 17 Apr 2024 04:54 IST

తెదేపా, జనసేన, భాజపా బందరు ఎంపీ అభ్యర్థి బాలశౌరి

మాట్లాడుతున్న ఎంపీ బాలశౌరి. పక్కన బుద్ధప్రసాద్‌ తదితరులు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: దివిసీమ వాసులు దశాబ్దాలుగా కోరుతున్న.. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్‌ను తాము గెలిచిన తర్వాత ఐదేళ్లలోనే పూర్తిచేస్తామని జనసేన, తెదేపా, భాజపా కూటమి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి, ఎంపీ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. కేంద్రాన్ని ఒప్పించి అనేక ప్రాజెక్టులకు తాను గత ఐదేళ్లలో నిధులను తీసుకొచ్చినా, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం తన కనీస వాటా విడుదల చేయకపోవడంతో వాటిని వాడుకునే వీలు లేకపోయిందన్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద రూ.360 కోట్లను తాను తీసుకొస్తే.. రాష్ట్రం మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయకపోవడంతో ఆ నిధులు వాడుకోలేకపోయాం. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అనేక సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తామని బాలశౌరి తెలిపారు. అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి బాలశౌరి విలేకరుల సమావేశం నిర్వహించారు.

పర్యాటక ప్రగతికి కృషి: హంసలదీవి, మంగినపూడి బీచ్‌లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పెట్టినట్టు బాలశౌరి తెలిపారు. గెలిచిన వెంటనే రూ.100 కోట్ల నిధులను తీసుకొచ్చి.. ఈ పర్యాటక ప్రాజెక్టు చేపడతామన్నారు. ఎదురుమొండి వంతెన నిర్మాణం కోసం నాబార్డు ఛైర్మన్‌తో మాట్లాడి రూ.109 కోట్లను తాను మంజూరు చేయిస్తే, దానిలో రూ.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని బాలశౌరి తెలిపారు. దీంతో వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎదురుమొండి వంతెనకు రూ.150 కోట్లతో మళ్లీ అంచనాలు రూపొందించి.. పూర్తిచేస్తామన్నారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరించే ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా చేపడతామన్నారు. కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేసే పోలవరం ప్రాజక్టుపై ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు.

తాగు, సాగునీటికి ప్రాధాన్యం: మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎంపీ బాలశౌరి సహకారంతో అవనిగడ్డను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. గతంలోనూ ఎదురుమొండి వంతెన కోసం బాలశౌరి నిధులు మంజూరు చేయిస్తే.. తాను హర్షం వ్యక్తం చేశానన్నారు. కానీ.. ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్‌బాబు గొడవ సృష్టించిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. తాగు, సాగు నీటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

జనసేనలోకి భారీగా చేరికలు..

వైకాపాకు చెందిన అవనిగడ్డ మాజీ ఎంపీపీ దిడ్ల ప్రసాద్‌, సోర్లగొంది గ్రామ అగ్నికుల క్షత్రియ కుటుంబాలు, కోడూరు మండలం బడేవారిపాలెం నాయకులు.. జనసేన పార్టీలో చేరారు. తెదేపా నాయకులు వేమూరి గోవర్ధన్‌రావు, కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే శ్రీనివాసరావు, జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, మండలి వెంకట్రామ్‌, గుడివాక శేషుబాబు, భాజపా నేత తుంగల వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు