logo

పాత బూత్‌ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ

అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్‌ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది.

Published : 24 Apr 2024 04:57 IST

తూర్పులో అధికార పార్టీ ఆగడాలు
కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే

ధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్‌ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. పోలింగ్‌ కేంద్రాలు అధికారికంగా మారినా పాత కేంద్రాల ముద్రణతోనే స్లిప్పులను అందిస్తున్నారు. విజయవాడ మూడో డివిజన్‌లోని కరెన్సీనగర్‌, కనకదుర్గ నగర్‌, శ్రీరామచంద్రనగర్‌, నాగార్జుననగర్‌ ఓట్లను ఇటీవల ఎన్నికల సంఘం మార్చింది. గతంలో వీరంతా 3 కి.మీ. దూరంలో ఉన్న గుణదల సెయింట్‌ జోసెఫ్స్‌ బాలికల పాఠశాలకు వెళ్లే వారు. దూరభారమవుతోందని ఓటర్లు తమ మనోవేదనను తెదేపా ప్రజాప్రతినిధి గద్దె రామ్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ‘ఈనాడు’ కథనాలు ప్రచురించింది. దీనిని అధికార వైకాపా వ్యతిరేకించి తమకు అనుకూలమైన వారి నుంచి సంతకాలు సేకరించింది. దీంతో తూర్పు ఎమ్మెల్యే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో క్షేత్ర పరిశీలన చేసిన ఎన్నికల సంఘం కరెన్సీనగర్‌, కనకదుర్గ నగర్‌ ఓటర్లను కాలనీలోని చైతన్య పాఠశాలకు, శ్రీరామచంద్రనగర్‌, నాగార్జుననగర్‌ ఓటర్లను కాలనీలోని నందమూరి త్రివిక్రమరావు సామాజిక భవనంలోకి మార్చారు. సుమారు 6వేల పైచిలుకు ఓటర్లు తమకు దగ్గరలోని పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే ఉపశమనం లభించింది.

ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న వైకాపా

పోలింగ్‌ కేంద్రాలు మార్చిన విషయాన్ని తెలుసుకున్న వైకాపా వర్గీయులు గత రెండు రోజులుగా స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పాత పోలింగ్‌ కేంద్రమే ఉన్నట్లు ముద్రించిన వాటిని పంచుతున్నారు. కానీ ఆన్‌లైన్‌లో కొత్తగా పోలింగ్‌ కేంద్రం మారినట్లుగా కనిపిస్తోంది. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే హడావుడిగా స్లిప్పులను పంపిణీ చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కానీ పోలింగ్‌ అధికారులు ఈనెల 25వ తేదీ నుంచి స్లిప్పులు పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ముందస్తు స్లిప్పుల పంపిణీ చేపడుతూ ఓటర్లను అయోమయంలో పడవేసేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని