logo

అదనపు పని భారంతో సిబ్బంది సతమతం

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.

Published : 24 Apr 2024 05:15 IST

అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
జగన్‌ ప్రభుత్వంపై ఆగ్రహం
ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, మాచవరం, న్యూస్‌టుడే

టా జాబ్‌ క్యాలెండర్‌ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు ఖాళీలు భర్తీకాక.. విధుల్లో ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. ఒక్కొక్కరు ఇద్దరేసి పని చేస్తున్నారు. కిందామీద పడుతూ.. అప్పగించిన అదనపు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి, ఆందోళనలకు గురవుతున్నారు. తమ పట్ల వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలికి వదిలేశారని దుయ్యబడుతున్నారు.

ఇంజినీర్‌ల కొరత

రహదారులు.. భవనాల, పంచాయతీరాజ్‌, జలవనరుల వంటి శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా దిగువ స్థాయిలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌ (ఏఈఈ)/ సహాయ ఇంజినీర్‌ (ఏఈ) వంటి పోస్టుల భర్తీ చేయడం లేదని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఒక్క పంచాయతీరాజ్‌ శాఖలోనే 600లకు పైగా ఏఈఈ/ఏఈ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వర్క్‌ఛార్జ్‌డ్‌ కింద పని చేస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పదవీ విరమణ చేయగానే, సదరు పోస్టులను తిరిగి భర్తీ చేయడం లేదు. వీరి స్థానే సైట్‌ ఇంజినీర్లను పొరుగు సేవల కింద తీసుకుంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక పనుల బాధ్యతలను సైట్‌ ఇంజినీర్లు చూస్తున్నా.. వీరికి ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. డీఎస్సీ  వాయిదా వేయడం.. పోలీసు శాఖలోనూ ఖాళీల భర్తీ లేకపోవడం వెరసి.. రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నట్టు చెబుతున్నారు.

అనారోగ్యం పాలవుతున్నాం..

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అటకెక్కడంతో.. ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు చేయాల్సిన పని ఒకరిపైనే పడడంతో చితికిపోతున్నామని.. ఫలితంగా అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. ఇక మండల, డివిజన్‌ స్థాయి అధికారులు, సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు, సమీక్షలు, సమావేశాలతో విసిగి పోతున్నారు. వారంలో అయిదు రోజుల పాటు వీసీలు, సమీక్షలు తదితరాలు తప్పడం లేదని, క్షేత్ర స్థాయిలో పనులకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల ప్రగతి చూపాల్సి వస్తోందని, చేసిన పనులకు బిల్లులు చెల్లించక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పలువురు అధికారులు తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. చేసిన పనులకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ఉద్యోగాలు భర్తీ కాకపోవడం వంటి కారణాలతో ఉద్యోగులు, అధికారులు సతమతమవుతున్నారు.


అదనపు భారంతో విసిగి పోతున్నా

-ఓ ఉద్యోగి

అదనపు భారంతో విసిగిపోతున్నాను. కేటాయించిన పనులే ఎక్కువ. దీనికి తోడు అదనపు పనులు. దీంతో పనులు పెండింగ్‌ ఉంటున్నాయి. విద్యుత్తు శాఖలో ఉద్యోగులను నియమించాలి.


ఇద్దరు చేసే పని ఒక్కరికే

-ఓ ఉద్యోగిని

ఇద్దరు ఉద్యోగులు చేసే పనిని ఒక్కదాన్నే చేస్తున్నాను. జీతం మాత్రం ఒకటే. విద్యాశాఖలో దస్త్రాలు పేరుకుపోతున్నాయి. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.


పనికి తగిన వేతనం ఏదీ

-ఓ ఉద్యోగి

సమాన పనికి సమాన వేతనమని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నతాధికారులు చేసే పనిని కూడా మేమే చేయాల్సి వస్తోంది. సర్వశిక్ష అభియాన్‌లో ఒత్తిడి పెరిగిపోతోంది. అనారోగ్యానికి గురవుతున్నాను.


పోస్టులు భర్తీ చేయరేం?

-ఓ ఉద్యోగిని

వైకాపా ప్రభుత్వంలో క్రీడాశాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. పొరుగు సేవల ఉద్యోగులతో కాలం నెట్టుకొట్టుస్తోంది. పనిలో నైపుణ్యం లేదు. ఒకే పనిని రెండు, మూడు సార్లు చేయాల్సి వస్తోంది. ఒక పనికే ఎక్కువ సమయం పడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని