logo

5 ఏళ్లు ఏం చేశావు జగన్‌

చంద్రబాబు పరిపాలనలో అక్షరాల 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని లెక్కలు తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలి.

Published : 10 Apr 2024 03:40 IST

ఊరించి ఉసూరుమనిపించిన వైకాపా ప్రభుత్వంపై యువత ఆగ్రహం
ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ముఖ్యమంత్రిగా చరిత్ర

చంద్రబాబు పరిపాలనలో అక్షరాల 23 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని లెక్కలు తేల్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలి. కోచింగ్‌ల కోసం మన పిల్లలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు. పరీక్షల షెడ్యూల్‌ మార్చేస్తారు. సిలబస్‌ మార్చేస్తారు. నాలుగున్నరేళ్లలో గాడిదెలు కాశావా చంద్రబాబు.. మేము అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ విడుదల చేస్తాం.


2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. మరి ఈ ఐదేళ్లు మీరేం కాశారు.. జగన్‌మోహన్‌రెడ్డి అని డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం మోగా డీఎస్సీ విడుదల చేస్తామని దగా చేసింది. బీఈడీ, టీటీసీ, పండిత శిక్షణ, వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులకు జగన్‌మోహన్‌రెడ్డి కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబునాయుడు ఏం చేశారని, మేము అధికారంలో కొచ్చిన వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఉపాధ్యాయ ఉద్యోగాలు గుర్తొచ్చాయి. 23 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేవలం 6,100 పోస్టులో అసంబద్ధంగా డీఎస్సీ-2024 విడుదల చేశారు. ఇచ్చిన ఉద్యోగ ప్రకటన కూడా సాఫీగా జరగలేదు. దేశచరిత్రలోనే ఎక్కడా లేని విధంగా టెట్‌, డీఎస్సీ ఒకేనెలలో విడుదల చేయడం విడ్డూరం. ప్రభుత్వం తీసుకొన్న అనాలోచిత నిర్ణయంపట్ల అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి. చివరకు ఎన్నికల కోడ్‌తో మొతం ప్రక్రియ వాయిదా పడింది. అధికారం చేపట్టిన 5 సంవత్సరాల్లో ఒక్క డీఎస్సీ కూడా పూర్తి చేయని సీఎంగా జగన్‌ చరిత్రకెక్కారు.

అనంత అభ్యర్థుల ఆవేదన

డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కువ. కరవు ప్రాంతమైన అనంత జిల్లాలోని గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఊరి వదిలి పట్టణాలకు చేరుకున్నారు. పట్టణాల్లో అద్దె గదులు, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ కోచింగ్‌లకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. కొందరు అవనిగడ్డ, కర్నూలులో శిక్షణ తీసుకున్నారు. తల్లిదండ్రులు కూలీనాలీ చేసి తమ పిల్లలను డీఎస్సీకి చదివిస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి కోచింగ్‌ ఇప్పిస్తున్నారు. పరీక్షలు నిర్వహించకుండా వాయిదా వేసి ప్రభుత్వం అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది.


కల్యాణమండపంలో పనికి కుదిరి..

పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లికి చెందిన కేశప్ప బీఎస్సీ బీఈడీ చేశారు. 2018 డీఎస్సీలో ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోయారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవారు. గత ఎన్నికల వేళ వైకాపా అధికారంలోకి వస్తే మెగా డీస్సీ విడుదల చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. ఐదేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఎన్నికల వేళ డీస్సీ విడుదల చేయడం, వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కుటుంబపోషణకు ప్రైవేట్‌ కల్యాణమండపంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.


ప్రభుత్వ తీరుతో అర్హత కోల్పోయాం

- ముత్యాలప్ప, అనంతపురం

ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డాను. గతంలో ఏటా నియామక ప్రకటన వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5 సంత్సరాల్లో ఒక్కటీ రాలేదు. నా వయసు 48 సంవత్సరాలు. ఐదేళ్లపాటు ఉద్యోగ ప్రకటన రాకపోవడంతో అర్హత కోల్పోయాను. వయో పరిమితి పెంచాలి. వైకాపా ప్రభుత్వ వైఖరితో ఎంతోమంది వయసు పైబడి అర్హత కోల్పోయారు. వారందరికీ అవకాశం కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది.


బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లికి చెందిన రోశయ్య, అంజినమ్మ దంపతుల తనయుడు రమేష్‌ 5 ఏళ్లుగా అనంతపురం నగరంలో అద్దె గదిలో ఉంటూ డీఎస్సీకి సన్నద్ధమవుతున్నాడు. 2018-డీఎస్సీలో ఉద్యోగం చేజారింది. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకొస్తే మెగా డీఎస్సీ విడుదల చేస్తారనే ఆశతో ఐదేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురు చూశాడు. గత సంవత్సరం శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇప్పటికి సుమారు రూ.2 లక్షలు ఖర్చు చేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. జగన్‌ను నమ్మి ఐదేళ్లు సమయం వృథా చేసుకొన్నానని, లేదంటే కియా పరిశ్రమలో ఉద్యోగంలో చేరేవాడినని రమేష్‌ వాపోతున్నాడు.


టీచర్‌ నుంచి బేల్దారిగా..

పుట్టపర్తి పట్టణం: నల్లమాడ మండలం తిప్పయ్యగారిపల్లికి చెందిన రమణప్ప ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యంతో బీఏ, టీపీటీ చేశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేశారు. ఏటా డీఎస్సీ విడుదల చేస్తానని, 26 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్‌ హామీ ఇవ్వడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వచ్చారు. ఐదేళ్లు గడిచిపోయినా ఉద్యోగాల భర్తీ ఊసేలేదు. చివరకు ఎన్నికల వేళ డీఎస్సీ విడుదల చేయడం, కోడ్‌ కారణంగా వాయిదా పడటం జరిగిపోయాయి. దీంతో రమణప్ప బెంగళూరుకు వెళ్లి తన పూర్వ సంస్థను సంప్రదించగా ఆయన స్థానంలో మరొకరిని తీసుకున్నట్లు చెప్పారు. నిరాశతో  స్వగ్రామానికి  వచ్చిన ఆయన కుటుంబపోషణకు బేల్దారి పనులకు వెళుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని