logo

నిర్బంధాలు.. వేధింపులు

సమస్యలు తీర్చాలని అడిగితే వేధింపులకు గురి చేయడం.. హక్కుల సాధనకు ఉద్యమిస్తే నిర్బంధాలు.. అరెస్టులతో భయపెట్టడం.. ఇవన్నీ జగన్‌ నిరంకుశ పాలనకు నిలువెత్తు సాక్ష్యం.

Updated : 16 Apr 2024 06:35 IST

ఐదేళ్లుగా ఉద్యోగులకు నరకం
హక్కులు.. సమస్యలపై ఉక్కుపాదం
ఒకటో తేదీ జీతం గగనమే
పుట్టపర్తి, జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే

సమస్యలు తీర్చాలని అడిగితే వేధింపులకు గురి చేయడం.. హక్కుల సాధనకు ఉద్యమిస్తే నిర్బంధాలు.. అరెస్టులతో భయపెట్టడం.. ఇవన్నీ జగన్‌ నిరంకుశ పాలనకు నిలువెత్తు సాక్ష్యం. ఐదేళ్లలో ఉద్యోగ వర్గాన్ని అన్ని విధాలా అణగదొక్కారు. తమకు దక్కాల్సిన వాటిని అడిగినా ఉక్కుపాదమే మోపారు. చిన్నపాటి నిరసన, ధర్నా చేయడానికి వీలులేకుండా వైకాపా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. హక్కులు.. సమస్యలను ప్రస్తావిస్తే గొంతు నులిమింది. కనీసం ఒకటో తేదీ జీతం ఇవ్వలేని దౌర్భగ్య, దయనీయ దుస్థితిని సర్కారు సృష్టించింది. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఏనాడూ ఇంత నిరంకుశత్వాన్ని చవిచూడలేదు.

నిబంధనలకు అనుగుణంగా రావాల్సిన ప్రయోజనాలను ఇవ్వకపోవడమే కాదు. నిత్యం ఒత్తిడితో పని చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది వైకాపా సర్కారు. ఉద్యోగమే వద్దురా దేవుడా... అన్న రీతిలో సతాయించింది. ఐదేళ్లకోసారి వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) సిఫార్సులకు అనుగుణంగా పెంచాల్సిన జీతాన్ని సైతం తగ్గించిన ఘనత జగన్‌కే దక్కింది. రివర్స్‌ పీఆర్‌సీపై ఉద్యోగ లోకం కన్నెర్ర చేసింది. చివరకు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, డీఆర్‌ తదితర ప్రయోజనాలను గణనీయంగా తగ్గించేసింది. ఒక్కో ఉద్యోగి ఐదేళ్లలో రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు నష్టపోయే దుస్థితిని కల్పించింది.

నెల ముగిస్తే ఎదురుచూపులే..

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ, పెన్షనర్లను మినహాయిస్తే... ఖజానా శాఖ లెక్కల ప్రకారం 83,854 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో రెగ్యులర్‌, ఒప్పంద, పొరుగు సేవలు, హెచ్‌ఆర్‌ పాలసీ, ఎఫ్‌టీఈ.. వంటి కేడర్ల వారు ఉన్నారు. ఎన్జీఓ, గ్రామ/వార్డు సచివాలయాలు, గెజిటెడ్‌, నాలుగో తరగతి, పొరుగు-ఒప్పంద ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఓ ఏడాది మినహా.. తక్కిన నాలుగేళ్లు ఏ నెలా ఒకటో తేదీన వేతనం పొందలేదు. జీతం కోసమే ఉద్యమాలు సాగిన సందర్భాలు ఉన్నాయి. ఇంటి అద్దె, బ్యాంకు కంతులు, నిత్యావసర సరకులు, పిల్లల చదువు ఫీజులు... ఇలా ప్రతిదానికి ఇబ్బంది ఏర్పడింది. జీతమో జగనో.. అని మొత్తుకున్నా కనికరం చూపలేదు.

  • జిల్లా జలవనరుల శాఖలో పని చేస్తున్న ఓ సహాయ ఇంజినీరు(ఏఈ) రెండేళ్ల క్రితం పీఎఫ్‌లో కొంత ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నారు. కుటుంబ అవసరాలకుగాను ఆ డబ్బు కోసం నిరీక్షిస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ ప్రభుత్వం ఊరిస్తుందే తప్ప... చెల్లించిన దాఖలాలు లేవు.
  • జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన వైద్యాధికారి ఆయన. అనారోగ్య రీత్యా బెంగళూరులోని కార్పొరేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. రీఎంబర్సుమెంటు బిల్లు కింద రూ.2 లక్షలు ప్రభుత్వానికి నివేదించారు. 2022, మార్చి 14న పంపారు. ఇప్పటికీ బిల్లు అతీగతీలేదు. ఖజానా శాఖ చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేదు.

సమాన వేతనం ఏదీ?

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం’ ఇస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మాట ఇచ్చి... అధికార పగ్గాలు చేపట్టాక మడమ తిప్పాడు. పొరుగు, ఒప్పంద సేవల ఉద్యోగులకు ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామంటూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ నీటి బుడగలా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 26 వేల మంది ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎవరికి సమాన పనికి సమాన వేతనం అమలు కాలేదు.


అటకెక్కిన క్రమబద్ధీకరణ

గతేడాది డిసెంబరులో జరిగిన డీఆర్‌డీఏ-వైైకేపీ ఉద్యోగుల ధర్నా

‘మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం’... అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే జగన్‌.. అధికారంలోకి వచ్చాక విస్మరించారు. ఏడాదిలోనే పొరుగు ఉద్యోగుల సేవను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ‘ఉపాధి’ ఉద్యోగులను గ్రామీణాభివృద్ధి శాఖలోకి విలీనం చేస్తాం. డీఆర్‌డీఏ-వైకేపీ ఉద్యోగుల సేవను క్రమబద్ధీకరిస్తామన్న హామీల ఊసేలేదు. వైద్య,ఆరోగ్య శాఖలో  పురుష ఆరోగ్యకార్యకర్త, ఎల్‌టీ, ఫార్మసిస్టు తదితరులు చాలా మంది ఉన్నా రెగ్యులర్‌ చేయలేదు. జూనియర్‌, డిగ్రీ అధ్యాపకులు, పాలిటెక్నిక్‌ ఉద్యోగులు, అధ్యాపకులనూ ఊరించి ఉసూరుమనిపించారు. ఇలా ఉద్యోగ వర్గాల్లో ఎవరికీ మేలు జరగలేదు.

రూ.కోట్లల్లో బకాయిలు

ప్రతి నెలా ఉద్యోగులు తమ జీతంలో కొంత దాచుకున్న సొమ్మును సైతం పొందడం గగనమైంది. ఏపీజీఎల్‌ఐ రుణాలు, జీపీఎఫ్‌, పీఎఫ్‌ బిల్లులు, అడ్వాన్సులు, పీఆర్సీ, ఈఎల్‌, డీఏ బకాయిలు.. ఇలా అనేక వాటి కోసం మూడేళ్లుగా పడరాని కష్టాలు పడుతున్నారు. వందలాది మంది పలు ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నా... పరిష్కరించే నాథుడే కరవయ్యారు. 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు, ఆర్జిత సెలవుల పెండింగ్‌ బకాయిలు.. రెండు విడతల్లో చెల్లిస్తామని నమ్మబలికి ఇప్పటికీ చుక్కలు చూపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.21వేల కోట్లు బకాయి ఉన్నట్లు తేలినా... ఇందులో ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు రూ.కోట్లల్లోనే రావాల్సి ఉంది.


వారంలో సీపీఎస్‌ రద్దన్నాడు ఏదీ?
- విజయభాస్కర్‌, ఆంధ్రప్రదేశ్‌  ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

అనంతపురం విద్య: ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా అధికారం చేపడితే వారం రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లయినా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఉద్యోగుల ఆరోగ్యకార్డులపై అన్ని నెట్‌వర్కు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యచికిత్సలు అమలు చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. పదవీ విరమణ చేసినవారికి ప్రయోజనాలు అందడం లేదు.


వేతనాలు సమయానికి అందడం లేదు
- హరికృష్ణ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు

ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియని ఆందోళన పరిస్థితి. ఉపాధ్యాయులు యాప్‌ల భారంతో ఇబ్బంది పడుతున్నారు. సీపీఎస్‌ అన్ని రాష్ట్రాల్లో రద్దు చేస్తుంటే మన రాష్ట్రంలో జీపీఎస్‌ ప్రవేశపెట్టారు. పీఎఫ్‌ రుణాలు రెండేళ్లైనా మంజూరు కాలేదు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యలు పరిష్కారం కాలేదు. గ్రామ, వార్డు సచివాలయాలకు సర్వీసు నిబంధనలు పరిష్కారం కాలేదు. అన్ని వర్గాల ఉద్యోగులూ ఇబ్బందులు పడుతున్నారు.


తగిన గుణపాఠం చెబుతాం
- లింగా రామ్మోహన్‌, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి

11వ పీఆర్సీలో మధ్యంతర భృతి (ఐఆర్‌) 27 శాతం ప్రకటించి, 23 శాతం ఫిట్‌మెంట్‌తో ఉద్యోగులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మోసం చేశారు. ప్రతిపక్ష హోదాలో జిల్లా, తాలూకా స్థాయిలోని ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ఐదేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదు. సకాలంలో డీఏ, డీఆర్‌లు ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే వాటిని అన్నింటినీ కలిపి కంటితుడుపు చర్యగా రెండు డీఏలను మాత్రమే ప్రకటించారు. సమస్యలపై ప్రశ్నించిన ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. తమను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసినవారికి తగిన గుణపాఠం చెబుతాం.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని