logo

ఇంటింటా వైద్యం అబద్ధం

‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల  ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’

Published : 18 Apr 2024 02:24 IST

ఆర్భాటానికే పరిమితమైన ఫ్యామిలీ డాక్టర్‌ విధానం

‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల  ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రగల్భాలు ఇవి..

  • వాస్తవంలో చూస్తే కార్యక్రమం మొక్కుబడిగా మారింది. వైద్యులు చుట్టపుచూపుగానూ రావడం లేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. అన్నిరకాల వ్యాధులకు మందు బిల్లలు ఇవ్వాల్సి ఉన్నా అందడం లేదు. గతంలో ఉన్న సంచార వైద్యవాహన పథకానికే పేరు మార్చి మమ అనిపించారు.

తిరుపతి(వైద్యం), న్యూస్‌టుడే: పల్లెల్లో వైద్యసేవలు మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటి వద్దకే వైద్యుల పేరిట గతేడాది ఏప్రిల్‌ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు చేసింది. రెండు జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలుపరిచిన తర్వాత ప్రవేశపెట్టింది. ఆ మేరకు 104 వాహనాల ద్వారా ఇద్దరు వైద్యులు ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు వెళ్లాలి. వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లో విధులు నిర్వహించే ఏఎన్‌ఎం, ఎంఎల్‌పీహెచ్‌లు, ఇద్దరు ఆశా వర్కర్లు ఆ గ్రామంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల దృష్టికి తీసుకురావాలి. సంచార వైద్య వాహనంలో వెళ్లే ఇద్దరు వైద్యులు ఒకరు వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లో ఓపీని నిర్వహించాలి. మరో వైద్యుడు ఇంటింటికి వెళ్లి రోగులను పరిశీలించి వైద్యసేవలు అందించాలి. అవసరమైన పరీక్షలు అక్కడే చేయాలి. నాణ్యమైన మందులు నెలకు సరిపడా అందజేయాలి. గ్రామంలోని పాఠశాలకు వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితులు, టీకాల గురించి అవగాహన కల్పించాలి.

వైద్యులు రాక.. మందులు ఇవ్వక

నిర్దేశించిన రోజుల్లో గ్రామాల్లోకి 104 సంచార వాహనాలు వెళ్తున్నా అందులో వైద్యులు ఉండటం లేదు. ఓపీలో సైతం సిబ్బందే మందు బిల్లలు ఇచ్చి పంపుతున్నట్లు ఆరోపణలున్నాయి. వైద్యులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం నియమించినప్పటికీ.. పర్యవేక్షణలేమి, సెలవుల కారణంగా వైద్యులు సక్రమంగా వెళ్లడం లేదు. ప్రతి వాహనంలో 64 రకాల మందులు.. 12 రకాల పరీక్షలు చేసేందుకు వీలుగా పరికరాలు ఉండాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చివరకు 20 రకాల మందులు చేర్చగా చివరకు ఇచ్చేది మధుమేహం, రక్తపోటు, జనరల్‌ సిరప్‌లు మాత్రమే. గర్భిణులకు అవసరమైన ఐరన్‌ మాత్రలు సైతం లేని పరిస్థితి. వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రిలేక మూడురకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేమి

నెలవారీ గ్రామాల్లోకి వచ్చే 104 వాహన సేవలపై పర్యవేక్షణ కొరవడింది. క్షేత్రస్థాయిలోని ప్రజలకు లబ్ధి చేరడం లేదు. వైద్యులు పరీక్షలు చేయడం లేదు. పడకల్లో ఉన్నవారి ఆరోగ్యస్థితిని వైఎస్‌ఆర్‌ క్లినిక్‌ వద్దకు వెళ్లి చెబితే.. సిబ్బందే దిక్కవుతున్నారు. వాహనంలో రక్తపోటు, మధుమేహం మాత్రలు మాత్రమే ఇస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేటును ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడేమో జ్వరానికే రూ.2-3 వేలు ఖర్చవుతోంది.

జి.మాధురి, నాయుడుపేట

ఒక్కరికీ పరీక్షలు చేయలేదు.

ఈ కార్యక్రమం ఉన్నట్లు మాకు తెలియదు. నేను కిడ్నీ వ్యాధిగ్రస్తుడిని. ఎవరూ మా ఇంటికి వచ్చి రోగం గురించి అడగలేదు. ఎలాంటి పరీక్షలు చేయలేదు. డాక్టర్‌ వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వలేదు. నేనే నెలనెలా తిరుపతి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను.

వై.వీరాస్వామి, సూళ్లూరుపేట

డెంగీతో ప్రాణాలు పోయినా స్పందన లేదు

మా గ్రామంలో విషజ్వరాలు ప్రబలాయి. డెంగీ విషజ్వరాలతో ఓ బాలిక మృతి చెందినా అధికారులలో చలనం లేదు. కనీసం గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

చంద్ర, వడ్డిపాళెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని