logo

Rajamahendravaram: మా ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి కనపడటం లేదు!

ఎంపీ, ఎమ్మెల్యే కనపడటం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Updated : 04 Nov 2023 06:56 IST

రాజానగరం మండలంలో వెలసిన గోడప్రతులు

రాజానగరం, న్యూస్‌టుడే: ఎంపీ, ఎమ్మెల్యే కనపడటం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో వెలిసిన పోస్టర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ అయిదేళ్ల నుంచి, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మూడేళ్ల నుంచి కనిపించట్లేదంటూ మండలంలోని నందరాడలో పలుచోట్ల పోస్టర్లు అతికించారు. అభివృద్ధి కోసం ఎంపీ నిధులు విడుదల చేయట్లేదని, పార్టీ విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా దుర్వినియోగం అవ్వడంతో అభివృద్ధి అగమ్యగోచరంగా ఉందని, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారని మరో పోస్టరులో ఉంది. ఈ పోస్టర్లు తానే అతికించినట్లు మాజీ ఎంపీటీసీ సభ్యుడు అడుసుమిల్లి హరికృష్ణ శుక్రవారం తెలిపారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదని, ఎంపీ, ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. ఆ ఆవేదనతోనే వీటిని అతికించినట్లు చెప్పారు. గ్రామంలోని రామకోవెల సెంటర్‌, దేవిడి సెంటర్‌, ఒనువులమ్మ గుడి వద్ద అతికించానని, మిగిలిన మండలాల్లో కూడా వీటిని అతికిస్తానని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో హరికృష్ణ వైకాపా తరఫున ఎమ్మెల్యే రాజా విజయానికి పని చేశారు. అనంతరం తనను దూరం పెట్టడంతో పార్టీకి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని