logo

అనుమతి కొంత అక్రమం కొండంత

పల్నాడులో మట్టి కొల్లగొడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారు. కొంత ప్రాంతానికి అనుమతులు తీసుకుని ఇష్టానుసారం ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ఇతరులెవరూ మట్టి తవ్వకాలు చేయకుండా అధికార

Published : 20 May 2022 04:15 IST

అడ్డగోలు తవ్వకాలతో రూ.కోట్లు స్వాహా

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే - గురజాల, గురజాల గ్రామీణ

ల్నాడులో మట్టి కొల్లగొడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అడ్డగోలు తవ్వకాలు చేస్తున్నారు. కొంత ప్రాంతానికి అనుమతులు తీసుకుని ఇష్టానుసారం ఇతర ప్రాంతాలకు విస్తరించారు. ఇతరులెవరూ మట్టి తవ్వకాలు చేయకుండా అధికార యంత్రాంగంతో అడ్డుకట్ట వేస్తున్నారు. మట్టి కావాల్సిన వారు వారి వద్ద కొనుగోలు చేసేలా చక్కబెట్టుకున్నారు. అనుమతులు పేరు చెప్పి అక్రమాలు కొనసాగిస్తున్నారు. అక్రమ తవ్వకాలకు భారీ గోతులు సాక్ష్యాలుగా మిగిలాయి.  

గురజాల మండలం దైద గ్రామం సమీపంలో 5.93 ఎకరాల భూమిలో మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని క్వారీ తెరిచారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తూ ఎప్పటికప్పుడు భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా నామమాత్రంగా పర్మిట్లు తీసుకుని అనుమతి లేని ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. భారీ యంత్రాలతో లోతుగా తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ భూములను గుల్ల చేస్తున్నారు. అక్రమ తవ్వకాలతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అటవీ ప్రాంతం కావడంతో అటువైపు ఎవరూ వెళ్లకపోవడం లీజుదారులకు కలిసొచ్చింది. రెండు భారీ పొక్లెయిన్లతో రాత్రీ పగలు ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చేస్తూ మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గురజాల, రెంటచింతల, దాచేపల్లి మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మట్టి అవసరమైనా ఇక్కడి నుంచి తరలిపోతోంది. కొత్తగా యూనిట్లు పెట్టేవారికి, ఇళ్లు నిర్మించుకునేవారికి, వెంచర్లు వేస్తున్న వారు, భూములు చదును చేసుకునేవారు ఇలా ఎవరైనా ఇక్కడి మట్టి కొనుగోలు చేయాల్సిందే. స్థానిక అవసరాలకు ఎవరైనా ఒక్క ట్రాక్టరు మట్టి ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నా వెంటనే యంత్రాంగాన్ని పంపి వారిని అడ్డుకుంటున్నారు.

దైద గ్రామం సమీపంలో తరలుతున్న మట్టి టిప్పర్‌

నిబంధనలకు నీళ్లు
భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతి తీసుకున్న పరిమాణం కంటే లీజు ప్రాంతంలో అధికంగా తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే కాకుండా సుమారు 15 ఎకరాల్లో ఇష్టానుసారం తవ్వకాలు చేశారు. నిబంధనలకు నీళ్లొదిలి అత్యంత లోతుగా తవ్వి తరలిస్తున్నారు. వర్షాలకు భారీ గోతుల్లో నీరు నిలిచి అటుగా వెళ్లే పశువులు, గొర్రెలు మృత్యువాత పడే అవకాశం ఉంది. గోతులు ఎగుడుదిగుడుగా మట్టి లభించే వరకు వెళ్తున్నారు. లోతు సూచించేలా మధ్యలో దిమ్మెలు వదలాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల మాచవరం మండలంలో అక్రమ తవ్వకాలు చేసిన నీటికుంటలో పడి ఇద్దరు వ్యక్తులు, ఎద్దులు చనిపోయిన విషయం విదితమే. దైద గ్రామం సమీపంలో అటవీప్రాంతంలో అక్రమతవ్వకాలు జరుగుతుండటంతో భవిష్యత్తులో గోతుల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వేల ట్రక్కుల  తరలింపు
దైద గ్రామం సమీపంలో మట్టి తవ్వకాలు చేస్తూ రోజుకు సగటున 100 టిప్పర్లకు పైగా మట్టి వెళ్తోంది. ఈ లెక్కన నెలకు మూడు వేల ట్రక్కుల మట్టి తరలిపోతోంది. 16 నెలలుగా తవ్వకాలు జరుగుతుండటంతో వేల ట్రక్కులు తరలించారు. గురజాలకు టిప్పర్‌ మట్టి రూ.5,500, ఇతర ప్రాంతాలకు దూరం మేరకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన ఎర్రమట్టి కావడం, చదును చేయడానికి, మొక్కల పెంపకానికి అనువుగా ఉండటంతో ఇక్కడి మట్టికి భారీ డిమాండ్‌ ఉంది. ఇదే అదునుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తవ్వకాల వైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటువైపు ఎవరైనా వెళ్తే ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తూ అడ్డుకుంటున్నారు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం లోపే ఇదంతా జరుగుతున్నా యంత్రాంగం దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇదంతా గురజాల మండలానికి చెందిన నేత ఒకరు చక్కబెడుతున్నారు. ఆయన అనుచరులను పెట్టుకుని వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. నిత్యం వందల లారీల మట్టి తరలిపోతున్నా ఎవరూ అడ్డుచెప్పకుండా చూసుకుంటున్నారు. అనుమతి కొంత ప్రాంతానికి తీసుకుని ఎక్కడపడితే అక్కడ తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్నారు.  


పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
- కిశోర్‌బాబు, ఇన్‌ఛార్జి సహాయ సంచాలకుడు, భూగర్భ గనుల శాఖ, దాచేపల్లి

దైద గ్రామంలో అనుమతులు తీసుకుని మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అనుమతి తీసుకున్న పరిమాణానికి అక్కడ తవ్వకాలు జరిగిన గోతులు పరిశీలిస్తాం. అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే జరిమానా విధిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని