logo

తక్కువ ధరకు స్థలం ఇప్పిస్తామని మోసం

స్థలం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ తమ వద్ద రూ.33.40 లక్షలు తీసుకొని మోసగించారని కృష్ణనగర్‌కు చెందిన రాజేశ్వరి సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్‌కు ఫిర్యాదు చేశారు.

Updated : 16 Apr 2024 06:05 IST

నగదు జమచేసిన పత్రాలు చూపుతున్న రాజేశ్వరి

గుంటూరు నేరవార్తలు: స్థలం తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ తమ వద్ద రూ.33.40 లక్షలు తీసుకొని మోసగించారని కృష్ణనగర్‌కు చెందిన రాజేశ్వరి సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఉండే అపార్టుమెంట్‌లోనే నివాసం ఉండే సుబ్రహ్మణ్యం భార్య పావని పరిచయమై తన భర్తకు పెద్దవారి వద్ద పలుకుబడి ఉందని, విలువైన స్థలాన్ని తక్కువకు ఇప్పిస్తానని చెప్పారు. దీంతో నా భర్త శ్రీనివాసరెడ్డిని సుబ్రహ్మణ్యం పరిచయం చేసుకున్నాడు. దేవాపురం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎదురుగా పది సెంట్ల ఖాళీస్థలం అమ్మకానికి వచ్చిందని, తక్కువ రేటుకు వస్తుందన్నాడు. ఆ స్థలానికి చిన్న వివాదం ఉందని, దాన్ని అతని మిత్రుడైన ఓ సీఐ ద్వారా పరిష్కరిస్తానని నమ్మించారు. ఫిబ్రవరి 2023 నుంచి జనవరి 2024 వరకు సుబ్రహ్మణ్యం, అతని కుమారుడు శ్రీనివాసు, వారి స్నేహితులు అశోక్‌, సుబ్బు, అయ్యప్ప, సీఐల ఖాతాలకు సుమారు రూ.33.40 లక్షలు నా ఫోన్‌ పే నుంచి జమచేశాను. ఆ మొత్తం డబ్బులు మాకు ఇప్పించే స్థలం విలువ నుంచి మినహాయిస్తామని, ఇది అడ్వాన్స్‌ అని నమ్మించారు. ఆ స్థలానికి సంబంధించినవని కొన్ని దస్తావేజులు చూపించి వాటిని సరిచేయాల్సిన పని ఉందని, అది అవ్వగానే మాకు అగ్రిమెంట్‌ చేస్తామన్నారు. జనవరి 2వ వారంలో మా పని ఎంతవరకు వచ్చిందని అడిగితే..మరో రూ.10 లక్షలు కావాలన్నారు. స్థలం అగ్రిమెంట్‌ చేయమంటే..తామడిగిన డబ్బులు  ఇవ్వకుంటే అప్పటివరకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావన్నారు. ఫిబ్రవరి 24న సుబ్రహ్మణ్యం మా అపార్టుమెంట్‌ ఖాళీ చేసి వెళ్లాడు. వివరాలు తెలుసుకొని సుబ్రహ్మణ్యంను డబ్బులు గురించి అడిగితే వాటిని మర్చిపోకపోతే గంజాయి, దొంగబంగారం కేసు పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. సుబ్రహ్మణ్యం అతని మనుషులు, సదరు సీఐ వలన తమకు ప్రాణహాని ఉందని చర్యలు తీసుకొని న్యాయం చేయాలని’ కోరామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని