logo

తెదేపాతో జత.. వైకాపాలో కలవరింత

జిల్లాలో తెదేపాలో చేరికలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్‌ నింపుతోంది.

Updated : 16 Apr 2024 05:51 IST

కూటమి గెలుస్తుందన్న కారణంతోనే..
అన్ని నియోజకవర్గాల్లోనూ పెరుగుతున్న చేరికలు
పర్చూరు నుంచి అత్యధికం
ఈనాడు-బాపట్ల

జిల్లాలో తెదేపాలో చేరికలు వెల్లువెత్తడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్‌ నింపుతోంది. నామినేషన్ల ఘట్టానికి ముందే ముఖ్య నేతలు వైకాపాను వీడి సైకిల్‌ ఎక్కుతుండటంతో జిల్లా వ్యాప్తంగా వైకాపా అభ్యర్థులను కలవరపెడుతోంది. కొద్ది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతోంది. ప్రత్యేకించి పర్చూరు నియోజకవర్గంలో ఈ చేరికలు అధికంగా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీని వీడి వస్తున్న వారిలో ముఖ్య నాయకులు ఉండటం వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నామినేషన్లకు ముందే ఫ్యాన్‌కు గుడ్‌బై చెప్పి తెదేపాలో చేరడానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం నాయకులకు కలగడమే ఈ చేరికలకు కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పర్చూరు వైకాపాలో ముఖ్య నేతలు పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఇక్కడ తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. నామినేషన్ల పర్వానికి ముందే పర్చూరులో వైకాపా ఖాళీ కానుండటంపై ఆ పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు పార్టీని వీడి వెళుతున్నా నిలువరించలేకపోతున్నారు. చేరికలతో నియోజకవర్గంలో తెదేపా బాగా బలపడుతోంది. ముందు నుంచి తెదేపాకు బలమైన నియోజకవర్గంగా ముద్రపడిన పర్చూరులో ప్రస్తుతం వైకాపా నుంచి వచ్చి చేరుతున్న వారితో కొన్ని గ్రామాల్లో అయితే వైకాపా ఉనికే లేకుండా పోతోంది. మార్టూరు మండలం రాజుపాలెంకు చెందిన ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ జాస్తి వెంకటనారాయణ(బాబు), ఆయన సతీమణి, ఎంపీటీసీ సభ్యురాలు హేమలత, గ్రామ సర్పంచి, ఉప సర్పంచితో పాటు 500 కుటుంబాలు వైకాపాను వీడటంతో ఆ గ్రామంలో వైకాపా ఖాళీ అయిందనే చెప్పాలి. అదొక్కటే కాదు ఇలా అనేక గ్రామాల్లో పార్టీకి ఏజెంట్లను పెట్టుకోవటం కూడా కష్టమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా యద్ధనపూడి, పూనూరు సొసైటీ ఛైర్మన్లతో పాటు గన్నవరం ఎంపీటీసీ సభ్యుడు, చినగంజాం మాజీ జడ్పీటీసీ, ఇద్దరు సర్పంచులు ఇటీవలే తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా గ్రామ రాజకీయాల్నే కాదు మండలాన్ని శాసించే వారు కావడంతో నామినేషన్లకు ముందే ఇక్కడ తెదేపా విజయం సునాయాసంగా మారింది. గతంలో మార్టూరు, యద్ధనపూడి, కారంచేడు మండలాల నుంచి చేరికలు ఉండగా ప్రస్తుతం చినగంజాం, పర్చూరు మండలాల నుంచి చేరికల పరంపర కొనసాగుతోంది. సోమవారం మార్టూరు మండలం కోలలపూడి, ఇంకొల్లు మండలం పోశపాడు నుంచి పలువురు యడం బాలాజీ వర్గానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. గడిచిన మూడు రోజుల నుంచి 20 మంది వార్డు సభ్యులు, నలుగురు ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు సర్పంచులు పార్టీలో చేరడం చేరికల తీవ్రతను తెలియజేస్తోంది. చినగంజాం మండలంలో అక్కడి ఎంపీపీ అంకమ్మరెడ్డి అనుచరగణం మొన్నీమధ్య వెయ్యి మంది వరకు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెదేపా కండువాలు కప్పుకొన్నారు.

ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెదేపాలో చేరిన కోలలపూడి గౌడ సామాజిక వర్గ నేతలు

ఇన్‌ఛార్జిల్ని తరచూ మార్చటంతో..

అధికారంలో ఉండి కూడా గడిచిన ఐదేళ్లలో పర్చూరులో పార్టీని ముందుండి నడిపించే సమర్థుడిని ఇన్‌ఛార్జిగా పెట్టకుండా నిర్లక్ష్యం వహించడం వంటి వాటితో ఆ పార్టీలో గ్రూపులు పెరిగిపోయాయి. ఆపై తరచూ ఇన్‌ఛార్జిలను మార్చడం వారు తమకు నచ్చినవారిని చేరదీయటం, నచ్చని వారిని దూరం పెట్టడం వంటివి పార్టీని వీడటానికి కారణాలుగా భావిస్తున్నారు. మరోవైపు తెదేపా-జనసేన-భాజపా పార్టీలు మూడు కూటమిగా ఏర్పడటంతో జనాలకు బాగా వారిపై నమ్మకం ఏర్పడిందని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని భావించి కూడా కొందరు ముందస్తుగానే పార్టీని వీడుతున్నారు. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో ఆదివారం ఒక్క రోజే 160 బలమైన వైకాపా కుటుంబాలు వచ్చి తెదేపా అభ్యర్థి ఆనందబాబు సమక్షంలో చేరారు. అదేవిధంగా కొల్లూరు మండలంలో 50 కుటుంబాలు చేరాయి. చీరాల, వేటపాలెం మండలాల నుంచి పలువురు వైకాపా కార్యకర్తలు అక్కడి అభ్యర్థి ఎం.ఎం.కొండయ్య సమక్షంలో చేరారు. రేపల్లె పట్టణంతో పాటు చెరుకుపల్లి, నగరం మండలాల్లో పలువురు అక్కడి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ నేతృత్వంలో పలువురు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని