logo

Children: పిల్లల్లో అకారణంగా నవ్వులు.. మూర్ఛలో ఇదో రకం

కారణం లేకుండా పిల్లలు ఒంటరిగా కూర్చొని అదే పనిగా నవ్వుతుంటే అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. మూర్ఛ(ఎఫిలెప్సీయా)లో ఇదో రకం వ్యాధి అని తెలిపారు. వైద్య పరిభాషలో గెలాస్టిక్‌ సీజర్స్‌గా

Updated : 28 Dec 2021 09:59 IST

మూడేళ్ల బాలికకు విజయవంతంగా శస్త్ర చికిత్స

ఈనాడు, హైదరాబాద్‌: కారణం లేకుండా పిల్లలు ఒంటరిగా కూర్చొని అదే పనిగా నవ్వుతుంటే అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు. మూర్ఛ(ఎఫిలెప్సీయా)లో ఇదో రకం వ్యాధి అని తెలిపారు. వైద్య పరిభాషలో గెలాస్టిక్‌ సీజర్స్‌గా వ్యవహరిస్తారు. రెండు లక్షల మంది చిన్నారుల్లో ఒకరు ఈ అసాధారణ సమస్యతో బాధపడుతుంటారని ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్‌ న్యూరో సర్జన్‌, మినిమల్‌ యాక్సెస్‌ బ్రెయిన్‌ అండ్‌ స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ రమేష్‌ తెలిపారు. తాజాగా మూడేళ్ల బాలికకు విజయవంతంగా ఈ సర్జరీ చేసినట్లు చెప్పారు. సోమవారం వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ‘‘మెదడులో ఐపోథాలమస్‌ అనే భాగం ఉంటుంది. ఇది చాలా కీలకమైనది. ఆ ప్రాంతంలో కణితి ఏర్పడినప్పుడు పిల్లలు గెలాస్టిక్‌ సీజర్స్‌ బారిన పడతారు. ఎప్పుడు పడితే అప్పుడు, కారణంగా లేకుండా నవ్వుతూ ఉంటారు. ఈ బాలికలో ఆరు నెలల క్రితం తల్లిదండ్రులు సమస్యను గుర్తించారు. ఎదుటివారిని పట్టించుకోకపోవడం, గుర్తుపట్టకపోవడం, రానురాను బాలిక ఎడమ కంటిలో మెల్ల వచ్చింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు కామినేని వైద్యులను సంప్రదించారు. ఎంఆర్‌ఐ పరీక్షలు చేయడంతో మెదడులోని హైపోథాలమస్‌ భాగంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స కూడా ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నది కావడంతో బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం వివరించామని, వారు ముందుకు రావడంతో శస్త్ర చికిత్స చేశాం’’ అని డాక్టర్‌ రమేష్‌ వివరించారు.  నావిగేషన్‌ ట్యూమర్‌ను తొలగించామని, త్వరలో రేడియేషన్‌ ప్రక్రియ చేపడతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని