logo

రోడ్డు రోలరు హాంఫట్‌!

వికారాబాద్‌ జిల్లా, తాండూరు మండలం, గుండ్లమడుగు తండాలో పట్ట పగలు రోడ్డు రోలరు చోరికి గురైంది. వింటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా రోడ్డురోలరు చాలా బలంగా ఉంటుంది. తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.

Published : 26 Jan 2022 01:22 IST

కాజేసి పాత సామగ్రి వ్యాపారికి విక్రయం

విడగొట్టి ఆనవాళ్లు కోల్పోయేలా చేసిన వైనం

ఇలా మార్చేశారు..

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా, తాండూరు మండలం, గుండ్లమడుగు తండాలో పట్ట పగలు రోడ్డు రోలరు చోరికి గురైంది. వింటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. సాధారణంగా రోడ్డురోలరు చాలా బలంగా ఉంటుంది. తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అంతటి రోడ్డురోలను సైతం చాకచక్యంగా లారీలో ఎక్కించి ఎత్తుకెళ్లారు. తాండూరు పోలీసులు తెలిపిన ప్రకారం.. తండా సమీపంలో గుత్తేదారు నర్సింహారెడ్డి నాలుగు నెలల క్రితం వంతెన, రహదారి పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో వినియోగించిన రోడ్డు రోలరును అక్కడే ఉంచారు. ఇటీవల మరోచోట పనులు చేపట్టడంతో దాంతో పనిపడింది. రోలరును తీసుకు రావాల్సిందిగా చోదకుడు కోటేశ్వర్‌కు గుత్తేదారు సూచించారు. అతను వెళ్లి చూస్తే అది కన్పించలేదు. స్థానికులను ఆరా తీయగా ఈమధ్యే జిన్‌గుర్తికి చెందిన షాబుద్దీన్‌ అనే వ్యక్తి లారీలో రోలర్‌ను తీసుకెళ్లినట్లు వివరించారు. వెంటనే షాబుద్దీన్‌ కలిసి ఎక్కడికి తీసుకెళ్లావంటూ నిలదీశాడు. కొందరు వ్యక్తులు గుత్తేదారు నుంచి రోలరును కొనుగోలు చేశామని చెప్పడంతో తాను లారీలో వారు చెప్పిన పాత సామగ్రి వ్యాపారి వద్దకు తరలించినట్లు చెప్పాడు. కోటేశ్వర్‌ వెంటనే ఆ దుకాణానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే రోలరును ఎక్కడికక్కడ భాగాలుగా విభజించి ఆనవాళ్లు కోల్పోయేలా చేశారు. ఖంగుతిన్న కోటేెశ్వర్‌, గుత్తేదారు నేరుగా గౌతాపూర్‌ సమీపంలోని ఠాణాకు చేరుకొని పోలీసులను ఆశ్రయించారు. రోలరును తస్కరించి విక్రయించిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలంటూ ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు.

లారీలో ఎత్తుకెళ్లిన రోడ్డు రోలర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని