logo

నగరంలో నడవగలరా?

మీరు రహదారి విస్తరించండి... మేం ఆక్రమిస్తాం అంటూ వ్యాపారులు.. వాణిజ్య సముదాయాలవారు, దుకాణదారులు, తోపుడుబండ్లు, పండ్ల వ్యాపారులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మార్గాలను కబళించేస్తున్నారు. ప్రజలు, ప్రయాణికులు, పాదచారులకు ఉపయోగపడుతున్న ప్రధాన రహదారులు, అనుసంధాన రహదారులను

Updated : 25 May 2022 08:52 IST

ఆక్రమణలకు గురవుతున్న కాలిబాటలు

రహదారులు విస్తరిస్తున్నా ప్రయోజనం శూన్యం

సనత్‌నగర్‌ బస్టాప్‌, కాలిబాట పూర్తిగా కబ్జా చేసిన వ్యాపారులు
రహదారులపై ప్రమాదాల్లో గాయపడుతున్న, మృతుల్లో రెండో స్థానం పాదచారులదేనని పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రెజిమెంటల్‌బజార్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, కాచిగూడ: మీరు రహదారి విస్తరించండి... మేం ఆక్రమిస్తాం అంటూ వ్యాపారులు.. వాణిజ్య సముదాయాలవారు, దుకాణదారులు, తోపుడుబండ్లు, పండ్ల వ్యాపారులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మార్గాలను కబళించేస్తున్నారు. ప్రజలు, ప్రయాణికులు, పాదచారులకు ఉపయోగపడుతున్న ప్రధాన రహదారులు, అనుసంధాన రహదారులను వీరు తమ హక్కుగా భావించి వ్యాపారాలు, వ్యాపార విస్తరణకు వాడేస్తున్నారు. మెట్రో నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ నిబంధనలు, ప్రజారవాణా మార్గదర్శకాల ప్రకారం రహదారులపై పాదచారులు నడిచేందుకు కాలిబాటలు తప్పనిసరి. పలుమార్లు కోర్టుల హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అధికారులు కొన్నిచోట్ల ఫుట్‌పాత్‌లు నిర్మిస్తున్నారు. వాహనాలు పెరిగిపోవడంతో రహదారులూ విస్తరిస్తున్నారు. ఇంత చేస్తున్నా నిత్యం రద్దీగా ఉండే ఆబిడ్స్‌, కోఠి, సికింద్రాబాద్‌లలో పాదచారులు నడిచేందుకు ఒక్కచోటా కాలిబాట లేదు. వాణిజ్య ప్రాంతాల్లో దుకాణ నిర్వాహకులు వాటిని ఆక్రమించుకుని వాహనాలు ఉంచడం లేదా వినియోగదారుల వాహనాలను అక్కడ ఉంచే సదుపాయం కల్పిస్తున్నారు.

రూ.కోట్లు వెచ్చించినా ఏడాది రెండేళ్లకు మళ్లీ మామూలే
రహదారుల విస్తరణ కోసం జీహెచ్‌ఎంసీ పాత, కొత్త భవనాలు కూలగొట్టేందుకు రూ.కోట్లు వ్యయం చేస్తోంది. పనులు పూర్తయిన ఒకటి, రెండేళ్లలోనే ట్రాఫిక్‌ కష్టాలు మళ్లీ మొదటికి వస్తున్నాయి. ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, కోఠి, మలక్‌పేట, మెహిదీపట్నం, సనత్‌నగర్‌, బాలానగర్‌, చింతల్‌, ఎల్బీనగర్‌, చైతన్యపురి రహదారులను వ్యాపారులు ఆక్రమించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారులు విస్తరిస్తుంటే... సరిగ్గా విస్తరించిన ప్రాంతం వరకు షోకేసులు, గొడుగులు, చెప్పుల స్టాండ్లు, హోటళ్ల ముందు పాన్‌షాప్‌లు ఉంచుతున్నారు. లక్డీకాపూల్‌లో పోస్టాఫీస్‌ నుంచి టెలిఫోన్‌ భవన్‌ వరకు రహదారి విస్తరించారు. పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌ నిర్మించారు. ఫుట్‌పాత్‌ మొత్తాన్నీ అక్కడి వ్యాపారులు ఆక్రమించారు.


పంజాగుట్ట కూడలిలోని మెరీడియన్‌ రెస్టారెండ్‌ వద్ద అక్రమ పార్కింగ్‌

లోకాయుక్త ఆదేశాలు.. కాగితాల్లో కమిటీలు
రహదారులపై ఆక్రమణల తొలగింపు, ఫుట్‌పాత్‌ నిర్వహణపై వార్డుకో కమిటీ వేయాలని లోకాయుక్త ఐదేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు తెలిపింది. కార్పొరేటర్‌ అధ్యక్షుడిగా కమిటీ ఏర్పాటుచేసి సభ్యులుగా జీహెచ్‌ఎంసీ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, సిటీ ప్లానర్‌, ట్రాఫిక్‌ విభాగం ఏసీపీ లేదా ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని సూచించింది. ఈ కమిటీ నెలకోసారి సమావేశమై డివిజన్‌ పరిధిలో ఫుట్‌పాత్‌ల నిర్వహణ, అక్రమణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని, మేయర్‌, జీహెచ్‌ఎంసీకి నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటివరకు కమిటీలు ఏర్పడలేదు. లోకాయుక్త ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి.


ఎక్కడెలా ఉందంటే..

అమీర్‌పేట వద్ద పూర్తిగా రోడ్డు ఆక్రమించి విక్రయాలు

* సికింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్‌ వద్ద నుంచి పాలికబజార్‌, మోండా మార్కెట్‌ సుభాష్‌ రోడ్డులో బాటా వరకు, రోడ్డు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు, రోడ్డుమీద చిరువ్యాపారులు కొనసాగుతుండటంతో అటు వచ్చే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* ఈఎస్‌ఐ నుంచి ఎర్రగడ్డ రైతుబజార్‌ వరకు సుమారు 300 వరకు తోపుడు బండ్లు, పండ్ల వ్యాపారులు కాలిబాటను ఆక్రమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు.
* పంజాగుట్ట కూడలిలో అక్రమ వాహన పార్కింగ్‌లతో అవస్థలు తీవ్రమయ్యాయి. పంజాగుట్ట కూడలిలోని మెరీడియన్‌ రెస్టారెంట్‌ వద్ద రోడ్డుపై రోజంతా కార్లు, పెద్ద వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్‌ సమస్యలేర్పడుతున్నాయి.
* అమీర్‌పేట నుంచి ఖైరతాబాద్‌ రోడ్డులో పంజాగుట్ట కూడలి వద్ద రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఇక్కడే ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఉంది. కూడలిలో ఎప్పుడూ ట్రాఫిక్‌ సిబ్బంది ఉంటారు. రోడ్డుపై అక్రమ పార్కింగ్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు.
* కాచిగూడ స్టేషన్‌ రోడ్డులో పాదబాటలు ఆక్రమణకు గురయ్యాయి. వాణిజ్య సముదాయం పార్కింగ్‌ సెల్లార్లలో వ్యాపార కార్యకలాపాలతో వాహనాలను పాదబాటపై నిలుపుతున్నారు. టూరిస్ట్‌ హోటల్‌ చౌరస్తాలో దుకాణదారులు పాదబాటలను చిరు వ్యాపారులకు అద్దెకిచ్చుకున్నారు. కాచిగూడ చౌరస్తాలో ఫ్రీలెఫ్ట్‌ వైపు ఉన్న నోపార్కింగ్‌ బోర్డు వద్ద రోజంతా వాహనాలు ఉంచుతున్నా పట్టించుకోరు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని