logo

రహదారులకు మోక్షం.. రాకపోకలకు సౌలభ్యం

ప్రధాన రహదారులకు మోక్షం లభించింది. గతకొన్ని సంవత్సరాలుగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలకు పనులు ప్రారంభించడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఉపశమనం లభించింది. తాండూరు-చించోళి అంతర్రాష్ట్ర రోడ్డును కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది.

Published : 02 Jul 2022 02:04 IST

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

గౌతాపూర్‌ మార్గంలో..

ప్రధాన రహదారులకు మోక్షం లభించింది. గతకొన్ని సంవత్సరాలుగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలకు పనులు ప్రారంభించడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఉపశమనం లభించింది. తాండూరు-చించోళి అంతర్రాష్ట్ర రోడ్డును కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించింది. ఈ మార్గంలో నిత్యం సిమెంటు లారీలు, ట్యాంకర్లు, బంకర్లు, నాపరాయి లారీలు, సుద్ద, ఎర్రమట్టి, కంకర వంటి ఎగుమతులు, దిగుమతులు చేసే 5వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. భారీ సరకు లోడుతో వెళ్లే వాహనాలతో తాండూరు మండలం కోటబాస్పల్లి నుంచి యాలాల మండలం జుంటిపల్లి దాకా అధ్వానంగా మారింది. అడుగులోతు గుంతలతో ఆనవాళ్లు కోల్పోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం రూ.26.72 కోట్లు కేటాయించడంతో పట్టణం ఠాణా నుంచి గౌతాపూర్‌లోని గనుల శాఖ చెక్‌పోస్టు దాకా పనులు మొదలయ్యాయి. ఇవి పూర్తయితే తాండూరు మండలంలోని 30 గ్రామాలతో పాటు పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చిపోయే వాహనదారులు, ప్రయాణికులకు సౌకర్యంగా మారనుంది.

రూ.కోటితో అంతారం: తాండూరు పట్టణం విలియమ్మూన్‌ చౌరస్తా నుంచి అంతారం శివారు వరకు రహదారి దెబ్బతిన్నది. రహదారిపై గుంతల్లో వర్షాకాలంలో వరద నిలిచి కుంటను తలపించేవి. దీంతో వాహనదారులు నిత్యకష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి. గతేడాది డీఎమ్‌ఎఫ్‌టీ నిధులు రూ.కోటి మంజూరు చేయడంతో తారు రోడ్డు నిర్మింపజేశారు. తాండూరు, పెద్దేముల్‌, బంట్వారం, కోట్‌పల్లి మండలాలతోపాటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌, సదాశివపేట, సంగారెడ్డికి రాకపోకలు సాఫీగా సాగేందుకు బాటలుపడ్డాయి.

రూ.2.52 కోట్లతో..

గౌతాపూర్‌ శివారు నుంచి చెంగెల్‌, చింతామణిపట్నం, పర్వతాపూర్‌ వరకు తారు రహదారి కంకరతేలింది. గుంతలుగా మారడంతో ప్రయాణ సమస్యలు నెలకొన్నాయి. ఏడాది కిందట ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద రూ.2.52 కోట్లు మంజూరు కావడంతో పనులు మొదలయ్యాయి. దాదాపు ఐదు కిలోమీటర్ల దాకా కంకర పనులు పూర్తయ్యాయి. త్వరలో తారు పనులు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు