logo

మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు: కేటీఆర్‌

తెలంగాణ కోసం తెగించి కోట్లాడేది భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. గురువారం అల్వాల్‌లో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.

Published : 10 May 2024 03:52 IST

ప్రసంగిస్తున్న భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. చిత్రంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

అల్వాల్‌, న్యూస్‌టుడే: తెలంగాణ కోసం తెగించి కోట్లాడేది భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. గురువారం అల్వాల్‌లో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. పదేళ్ల క్రితం మోదీ ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని.. మరోసారి ఇప్పుడు భాజపా దేశ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతోందని విమర్శించారు. మోదీ గ్యారంటీ అంటే ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ ధర తగ్గినా పెట్రోల్‌ ధరలు తగ్గించలేని అసమర్థ ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు. కులం, మతం ఆధారంగా ఓటు వేయవద్దని యువతను కోరారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగా ముఖమంత్రి రేవంత్‌రెడ్డి హామీలు ఉన్నాయన్నారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, భారాస ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎంబీసీ మాజీ ఛైర్మన్‌ నందికంటి శ్రీధర్‌, కార్పొరేటర్లు విజయశాంతి, సబిత, శ్రీధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ ప్రాంతం సిఖ్‌రోడ్డులోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో గురువారం యువ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణపై భాజపా సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, మతం కులం ఆధారంగా ఓటేయవద్దనీ.. తెలంగాణ కోసం తెగించి కొట్లాడే భారాస అభ్యర్థులకు ఓటు వేయాలని అన్నారు. భారాస హయాంలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాకతో రాష్ట్రాభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. గత ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి యువతకు స్కూటీలు ఇస్తానని చెప్పి, ఇంతవరకు ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హామీలు ఓ స్త్రీ రేపురా.. అనే విధంగా ఉన్నాయని అన్నారు. ఎంతో అమూల్యమైన ఓటు హక్కును యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్‌ అభ్యర్థి నివేదిత, మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కరవు వచ్చిందని అన్నారు.  ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... రానున్న రోజుల్లో సుపరిపాలన అందాలంటే యువత ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కంటోన్మెంట్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని